పీఆర్‌పై మమకారం..’ఉపాధి’పై ప్రతాపం

– ఇచ్చిందే రికార్డు..చేసిందే ఆడిట్‌
– పంచాయతీరాజ్‌, ఫారెస్టు
– శాఖలను ముట్టుకోని ఆడిటర్స్‌
– ఆడిట్‌కు రాని రూ.3 కోట్ల 60లక్షల
– ఆ శాఖల రికార్డులు
– ఉపాధి కూలీలు, సిబ్బందిపైనే అధికారుల ప్రతాపం
– వీరు చేసిన రూ.4కోట్ల 77లక్షలకే ఆడిట్‌
– ప్రతి సామాజిక తనిఖీలోనూ ఇదే తంతు
– సామాజిక తనిఖీ మండల సభకు హాజరు కాని వైనం
– పక్కదారి పడుతున్న రూ.కోట్ల ఉపాధి నిధులు
– అధికారులను నిలదీసిన సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఉపాధిహామీపై చేపడుతున్న సామాజిక తనిఖీ పక్కదారి పడుతుంది. ఆడిట్‌లో ఉపాధి మినాహా, కొన్ని శాఖలు రికార్డులు ఇవ్వకున్నా మమా అనిపిస్తున్నారు. కేవలం ఉపాధి హామీ కూలీలపైనే ఆడిట్‌ చేస్తూ కూలీలపై ప్రతాపం చూపిస్తున్నారు. పని చేసిన కూలీలు, సిబ్బందిపై కన్నెర్ర చేస్తున్నారు. నిధులు పక్కదారి పడుతున్నాయని రికవరీ చేస్తున్నారు. కానీ పంచాయతీరాజ్‌, ఫారెస్టు శాఖలు చేసిన రూ.3కోట్ల 60లక్షల పనుల రికార్డులు మాత్రం లేక్కలు లేవు. తనిఖీలు కావు. సామాజిక తనిఖీ విభాగం, డ్వామా అధికారులు పట్టించుకోలేదు. ఇదేం సామాజిక తనిఖీ అని మండల ఓపెన్‌ఫోరాన్ని సీపీఐ(ఎం) నాయకులు అడ్డుకున్నారు. కేవలం కూలీలు చేసిన పనులపైనే ఆడిట్‌ చేస్తే, పంచాయతీరాజ్‌, ఫారెస్టు శాఖలు చేసిన ఉపాధిహామీ పనులపై ఎందుకు ఆడిట్‌ చేయడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్‌ జంగయ్య, మండల కార్యదర్శి పి.జంగయ్య నిలదీశారు. ఫారెస్టు శాఖ చేసిన రూ.70లక్షల, పంచాయతీరాజ్‌చేసిన రూ.2కోట్ల 87లక్షల నిధులపై ఎందుకు తనిఖీ నిర్వహించలేదని నిలదీశారు. మరి ఉపాధిహామీ కూలీలు చేసిన రూ.4కోట్ల77లక్షల 45వేల 356 పనులపైనే ఎందుకు తనిఖీ నిర్వహిస్తున్నారని అధికారులను నిలదీశారు. దాంతో మండల స్థాయి ఓపెన్‌ఫోరం నాలుగు గంటలు నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం మండలంలో 1 డిసెంబర్‌ 2021 నుంచి 31 మార్చి2023 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా 339 పని ప్రదేశాల్లో రూ.8కోట్ల 35లక్షల 48వేల338 నిధులు పనులకు ఖర్చు చేశారు. అయితే వీటిలో రూ.4కోట్ల 77 లక్షల 45 వేల 356 నిధులను ఉపాధిహామీ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల పనులను కూలీల ద్వారా చేయించారు. వీటిలో రూ.4కోట్ల14 లక్షల 17వేల653 నిధులను కూలీల ద్వారా చేయించగా, రూ.63లక్షల 27 వేల703 నిధులను మెటీరియల్‌ కింద ఖర్చు చేశారు. అయితే ప్రస్తుతం సామాజిక తనిఖీ విభాగానికి ఈ రికార్డులను అందజేశారు. వీటిపై ఆడిట్‌ నిర్వహించారు. అయితే వీటిలో పంచాయతీరాజ్‌ శాఖకు 74 పనులను బదిలీ చేశారు. ఈ శాఖ ఆధ్వర్యంలో రూ.2కోట్ల 87 లక్షల 30వేల 810 నిధుల పనులు జరిగాయి. వీటిలో కూలీలకు లక్ష 6వేల ఏడు రూపాయలను ఖర్చు చేయగా, రూ.2 కోట్ల 86 లక్షల 24వేల803లను మెటీరియల్‌ కింద వాడారు. అదే విధంగా ఫారెస్ట్‌ శాఖకు 20పనులకు సంబంధించి నర్సరీల ఏర్పాటు, ఫారెస్ట్‌ లో మొక్కల పెంపకానికి రూ.70 లక్షల72వేల 180 బదిలీ చేశారు. వీటిలోనూ కూలీల ద్వారా రూ.40 లక్షల 72 వేల 29 ఖర్చు చేయగా, రూ.29 లక్షల 99 వేల 973 మెటీరియల్‌ కింద ఖర్చు చేశారు. అయితే ఫారెస్ట్‌, పంచాయతీరాజ్‌ శాఖలు చేసిన రూ.3 కోట్ల 58 లక్షల 2వేల 992 సంబంధించి లెక్కలను సామాజిక తనిఖీ విభాగానికి అందించలేదు. దాంతో సామాజిక తనిఖీ విభాగం అధికారులు కేవలం ఉపాధి ద్వారా చేసిన రూ.4కోట్ల77 లక్షల 45 వేల 356 మాత్రమే ఆడిట్‌ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఫారెస్టు, పంచాయతీ అధికారులు రికార్డులు ఇవ్వలేదని చేతులెత్తేశారు. దాంతో మండల స్థాయి ఓపెన్‌ ఫోరంలో గందరగోళం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) నాయకులు ఈ లెక్కలపై నిలదీశారు.
అధికారుల నిలదీత
సామాజిక తనిఖీలు, ద్వామా అధికారులు కేవలం కూలీలు, ఉపాధిహామీ సిబ్బంది చేసిన పనులపైనే తనిఖీ నిర్వహిస్తున్నారని, పంచాయతీరాజ్‌, ఫారెస్ట్‌ శాఖలు చేసిన పనులపై ఎందుకు ఆడిట్‌ చేయడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్‌, సీహెచ్‌ జంగయ్య, పీ.జంగయ్య నిలదీశారు. మండల ఓపెన్‌ ఫోరానికి మండల స్థాయి అధికారులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ముందు పీఆర్‌ ఏఈ, ఫారెస్టు అధికారులను సభకు పిలిపించాలని పట్టుబట్టారు.ఆ తర్వాతనే సభ నిర్వహించాలని పట్టుబట్టారు. దాంతో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలిచిపోయింది. ఏఈ, ఫారెస్టు అధికారులను పిలిపించారు. రెండు రోజుల్లో రికార్డులను అందజేస్తామని వారు హామీ ఇచ్చిరు. దాంతో మరోసారి ఆ శాఖల పనులపై సామాజిక తనిఖీ నిర్వహించి గ్రామసభ నిర్వహించాలని నాయకులు పట్టుబట్టారు. అందుకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. చివరకు అధికారులు అంగీకరించారు. దాంతో మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సామాజిక తనిఖీ ఓపెన్‌ ఫోరం కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ నీరజ, ఎంపీడీవో వెంకటమ్మ,ఏపీఓ తిరుపతాచారి, ఓపెన్‌ఫోరం పరిశీలకులు ఉన్నారు.