ప్రజా ఆశీర్వాద యాత్ర ఇంటింటి ప్రచారానికి సెగ

ప్రజా ఆశీర్వాద యాత్ర ఇంటింటి ప్రచారానికి సెగ– దళితబంధుపై మంత్రి కొప్పులకు నిరసన
నవతెలంగాణ – ఎండపల్లి
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు దళితబంధు అర్హుల నిరసన సెగ తగిలింది. ఎన్నికల నేపథ్యంలో ప్రజా ఆశీర్వాదయాత్రను జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజ కవర్గంలోని వెల్గటూర్‌ మండలం లోని జగదేవ్‌పేట్‌ గ్రామంలో బుధవారం ప్రారం భించారు. వెల్గ టూర్‌ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అడుగుపెట్టగానే దళితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దళితబంధు ఎంపికలో ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని నిలదీశారు. కటిక దారిద్య్రంలో ఉన్న తమకు దళితబంధు పథకంలో ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. దీంతో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు దళితబంధు పథకం నిరంతర ప్రక్రియ అని, రాష్ట్రంలో విడతల వారీగా దళితులందరికీ వర్తింప చేస్తామని వారించే ప్రయత్నం చేశారు. కాగా ప్రథమ ప్రాధాన్యంలో మీరెందుకు దళితబంధు తీసుకున్నారని, కూలిపోయే ఇండ్లలో కాలం గడుపుతున్నామని, కొందరికి ఇండ్లు లేక కిరాయికి ఉంటున్నారని అయినా తమకు దళితబంధు, గృహలక్ష్మి రాదంటూ మహిళలు, దళితులు ఎదురు ప్రశ్నించడంతో స్థానిక నాయకులు అవాక్కయ్యారు. దీంతో చేసేది ఏమీ లేక మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మెయిన్‌ రోడ్డులో ప్రజా ఆశీర్వాద యాత్రను మొదలుపెట్టి తూతూ మంత్రంగా పూర్తి చేశారు.