– 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవన్‌లు : మంత్రులు కొండా సురేఖ, సీతక్క
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకొని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగసభ వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, బడుగు, బలహీన వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇచ్చే సాయాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపుదల, రూ.2 లక్షల రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని వేల కోట్ల రూపాయాల రుణాలను అందిస్తూ వారి స్వయం సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వరంగల్ పర్యటనలో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందన్నారు.