ప్రజాశక్తి ప్రస్థానం…’నవ’ తెలంగాణ పురోగమనం

ప్రజాశక్తి ప్రస్థానం...'నవ' తెలంగాణ పురోగమనం‘నవతెలంగాణ’కు తొమ్మిదేండ్లు నిండాయి. దశాబ్దాల ప్రజాశక్తి వారసత్వం పుణికిపుచ్చుకుంది నవతెలంగాణ. ప్రజాశక్తి దిపపత్రిక నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుని 45వ వార్షికోత్సవ ఘట్టంలో ప్రవేశిస్తున్నది. అక్షరాక్షర దీక్షగా / ఆశయాలే రక్షగా / నడచివచ్చిన దారులు / గడిచిపోయిన రోజులు…ఈ సందర్భంలో కండ్లముందు కదలాడతాయి. దానితో సన్నిహిత సంబంధం, భాగస్వామ్యం ఉన్న వారికి పత్రిక చరిత్ర,పెరుగుదల కండ్ల ముందు కదలాడతాయి. తెలుగులో పత్రికలు ప్రధానంగా సంఘ సంస్కరణలు, స్వాతంత్య్ర పోరాటం, వామపక్ష ఉద్యమాలు అన్న మూడు నేపథ్యాలలో తొలి అడుగులు వేశాయి.1942లో ప్రజాశక్తి వారపత్రికగా ప్రారంభమైంది. ఆ విధంగా చూస్తే ఇది ఎనభయ్యవ వార్షికోత్సవం కూడా. ఫాసిస్టు యుద్ధాన్ని ఖండించడంలోను, ప్రగతిశీల భావాలను వ్యాపింపచేయడంలోనూ నాటి ప్రజాశక్తి కీలకపాత్ర వహించింది. 1945లో దినపత్రికగా మారింది. పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి, మద్దుకూరి వంటి వారి కృషి ఇందులో ఉంది. శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, ఉప్పల లక్ష్మణరావు వంటి సుప్రసిద్ధుల రచనలు దానిలో వచ్చేవి. గ్రాంధికం, వ్యవహారం, వాదోపవాదాల మధ్య పత్రికా భాష ఇంకా పూర్తిగా స్థిరపడని ఆ కాలంలో జన సామాన్యానికి అర్థమయ్యే విధంగా రాయడంలో ప్రజాశక్తి భాషకు వరవడి, భావాలకు వరిపిడి అయింది. ఇది నచ్చని ఛాందసులు పెద్ద బాలశిక్ష ఫెయిల్‌ – ప్రజాశక్తి పాస్‌’ అని అపహాస్యం చేశారు కూడా! 1946లో ప్రారంభమైన తెలంగాణా రైతాంగ పోరాటానికి ప్రజాశక్తి వాణిగా పనిచేసింది. ప్రభుత్వం 1948లో విజయవాడలోని ప్రజాశక్తి నగర్‌పై దాడిచేసి, విధ్వంసానికి పాల్పడింది. నిజాం నవాబు కూడా హైదరాబాద్‌ సంస్థానంలో నిషేదించాడు. నూతన స్వాతంత్య్రం,రాష్ట్రాల ఏర్పాటు,ఎన్నికలు తదితర పరిణామాల మధ్య మళ్లీ 1951లో వారపత్రికగా పునఃప్రారంభమైంది. కొన్నాళ్ల తర్వాత దినపత్రికగా మారి విశాలాంధ్ర పేరుతో పున:ప్రారంభమైంది. మద్దుకూరి చంద్రం, మోటూరు హనుమంతరావు తదితరులు దాని సంపాదకులుగా ప్రసిద్ధులు. ప్రజాశక్తి 1968లో వారపత్రికగా 1981 ఆగస్టు ఒకటవ తేదీన దినపత్రికగా అవతరించింది. మోటూరు హనుమంతరావు అధక్షతన పుచ్చలపల్లి సుందరయ్య సమక్షంలో నాటి సీపీఐ(ఎం) కార్యదర్శి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ దాన్ని ఆవిష్కరించడం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నట్టేవుంది. చాలామంది ఈ పత్రిక నడవటం కష్టమని మాతోనే అనేవారు. కాని సందేహాలు పటాపంచలు చేస్తూ అక్షరాయుధంగా పదునెక్కుతూ ప్రజాశక్తి ప్రస్థానం నడిచింది. అంకితభావం గల నాయకత్వం సంపాదకులు, కార్మికులు, ఉద్యోగ సిబ్బంది సేవలు, ఉద్యమాభిమానులు పత్రిక శ్రేయోబిలాషుల అందదండలు దాన్ని నిలబెట్టాయి..
అన్ని దశల్లోనూ కీలకపాత్ర
1991లో సోవియట్‌ యూనియన్‌ కూడా విచ్ఛిన్నమైంది. దేశంలో సరికొత్త ఆర్థిక విధానాలు, వాటిని వెన్నంటి రాజకీయాలలో మితవాద, మతవాద దాడి మొదలయ్యాయి. చివరకు 1998లో బీజేపీ అధికారం చేపట్టింది. రాష్ట్రంలో తెలుగుదేశం దానితో జతకట్టి మరోసారి అధికారంలోకి వచ్చి ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేయడంలో ప్రథమ పీఠిన నిలిచింది. పత్రికల మైండ్‌సెట్‌ మారాలని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండేవారు. ఆ సమయంలో సాగిన విద్యుచ్చక్తి ఉద్యమానికి ప్రజాశక్తి ప్రాణవాయువులా పనిచేసింది.ఆ ప్రభుత్వం మారి 2004లో వైఎస్‌ ప్రభుత్వం వచ్చాక భూపోరాటం వంటివి జరిగాయి. తర్వాత తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమం మొదలైంది.
2014ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడ్డారు.. ప్రజాశక్తి ఒరవడిలో, ఉద్యమాల స్పూర్తితో ‘నవతెలంగాణ’ ఆవిర్భవించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పత్రికలు తమ తమ పరిస్థితులకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలకూ అండగా వుంటూ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నాయి. రాజకీయ పరిస్థితులు ఎన్ని విధాలుగా మారి ఎన్ని సవాళ్లు వచ్చినా కర్తవ్య నిర్వహణకు చైనత్య ప్రేరణకూ అంకింతం కావడంలోనే ప్రజాశక్తి విశిష్టత వుంది. కేంద్రంలోనేమో కరుడుగట్టిన మతతత్వం, కార్పొరేట్‌ తత్వం, సామ్రాజ్యవాద అనుకూలతల కలయికగా మోడీ ప్రభుత్వం కొలువుతీరింది. ఈ దశలన్నిటా ప్రజాశక్తి ప్రజలకోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వేదికగా నిలిచింది. నిలుస్తోంది. ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతిరూపమైంది.
సోవియట్‌ విచ్చిన్నంతో చరిత్రాంతాన్ని గురించిన సిద్ధాంతాలు చెలరేగుతున్నప్పుడు ప్రజాశక్తి సోషలిజం భావన అజేయమని చెప్పగలిగింది. ప్రపంచీకరణ వేదమంత్రంలా మార్మోగుతున్నప్పుడు ప్రత్యామ్నాయ పోరాటాలను ముందుకు తెచ్చింది.1990ల నుంచి మతోన్మాదం మంటలు పెడుతున్నప్పుడు లౌకిక పతాకం ఎగరేయడంలో నిర్భయంగా నిలబడింది, ఇవి చిన్న విషయాలు కాదు. ఆశయ బలమే ప్రజాశక్తి, నవతెలంగాణకు ఆ శక్తి నిచ్చింది.మోయలేని భారంగా మారిన పత్రికా నిర్వహణలో కొన్ని ప్రముఖ పత్రికలే ఆగిపోయాయి. ఆగినవాటిలో ఒక పత్రిక తప్ప వాటిలో మళ్లీ గట్టిగా బతికి బట్టకట్టినవి లేవు. నిన్నటి పెద్ద పత్రికలు కొన్ని ఇప్పుడు నామమాత్రంగా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రజాశక్తి ఎనిమిది ఎడిషన్లతో విస్తృతమైన యంత్రాంగంతో,రంగుల యంత్రాలతో ముందుకుపోవడం ఫలప్రదమైన ప్రయోగం. కొత్త రాష్ట్రంలో కొత్త రూపంలో పుట్టిన నవతెలంగాణ కూడా నాలుగు ఎడిషన్లతో విస్తరణ పథంలో పురోగమిస్తున్నది. సమస్యలు లేవని కావు, వనరుల కొరత లేదనీ కాదు. తీవ్రమైన కరోనా తాకిడితో సహా చాలా సంక్లిష్ట సమస్యలే ఎదురయ్యాయి. అంకితభావం గల సిబ్బంది రాజకీయ నైశిత్యం, ఉద్యమాల ఆలంబన, శ్రేయోభిలాషుల అండదండలు ఉంటే సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించడం సాధ్యమని ఈ పత్రికల పురోగమనం నిరూపిస్తుంది.
మార్పులకు అన్వయించుకుంటూ…
సామాజిక మార్పులను సాంకేతిక ప్రగతిని పరిగణనలోకి తీసుకుని ముందుకు పోవడంలోనే ఈ పురోగమన రహస్యం వుంది. రష్యన్‌ సోషలిజం ప్లస్‌ అమెరికన్‌ మేనేజ్‌మెంటు అని స్టాలిన్‌ అన్న మాటలు సుప్రసిద్ధం. సంస్కరణలు వాటికవే చెడ్డవి కావు. చెడ్డ సంస్కరణలే ప్రమాదకరమైనవి.సామాజిక మార్పులను సాంకేతిక ప్రగతి పరిగణనలోకి తీసుకుని ముందుకు పోవడంలోనే ఈ పురోగమన రహస్యం వుంది. ప్రజాశక్తి, నవతెలంగాణ ఆ సూత్రాన్ని అన్వయించుకోవడం వల్లనే ప్రగతిశీల వాదులకు వేదిక కాగలిగింది. తమ మౌలిక అభిప్రాయాలకు కట్టుబడి ఉంటూనే లోగోతో సహా అనేక మార్పులు చేసుకుంది. నవతెలంగాణ కూడా ఈ చారిత్రక నేపథ్యంలోనిదే.
ఈ నలభయ్యేండ్లలో మీడియా ముఖచిత్రం ఎంతగానో మారింది. ఆధిపత్యశక్తులకు అంగీకార సృష్టి నేటి ప్రపంచాధిపత్య వ్యూహంలో ప్రధానాంశం. ఇందులో పెద్ద పాత్ర మీడియాది. అందుకే ప్రజానుకూల శక్తులు ప్రత్యామ్నాయ మీడియా కోసం పెద్ద కృషి చేస్తున్నారు. అమెరికా వంటి చోట్ల కూడా ప్రత్యామ్నాయ భావజాల కృషి ఉధృతమవుతున్నది. తెలుగు మీడియా ముఖ్యులలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రగతిశీల భావాల ప్రేరణ లేనివారు చాలా తక్కువ.కానీ ఇప్పుడు భారతీయ మీడియాలో ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ సోషల్‌ మీడియాలోనూ కార్పొరేట్‌ శాసనం ప్రబలిపోయింది. ఆంక్షల అంకుశాలు, నిరంకుశ పాలకుల శాసనాలు మీడియాను వేటాడుతుంటే ఆ విలువలు వెలవెలబోతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగునాట ప్రధాన పత్రికలు ఛానళ్లు రెండు ప్రాంతీయ పాలక పార్టీల మధ్య విభజింపబడి వివాదాలలో ముుగితేలుతున్నాయి.దేశం నెత్తిన కూచున్న మోడీ అప్రజాస్వామిక పోకడలను బహిర్గతం చేయడం వీటి ఎజెండాలోనే వుండదు. అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యాన్ని ప్రతిఘటించడమూ వుండదు. పెగాసస్‌,కాశ్మీర్‌, రైతాంగ ఆందోళన, యూరప్‌లో మితవాద విజృంభణ,లాటిన్‌ అమెరికాలో విజయాలు ఏదైనా సరే వీటికి అవసరం లేని పని, స్థానిక పాలక పార్టీల ప్రయోజనాలకూ, ఢిల్లీపెద్దల దృక్పథానికి విరుద్దమైన విశ్లేషణలూ, పరిశీలనలూ వీటిలో అరుదుగా గానీ కనిపించవు. ఈసోషల్‌ మీడియా యుగంలో ఇందుకు సంబంధించిన విస్తారమైన సమచారం ప్రజాస్వామిక మేధావులు, పాత్రికేయులు, రచయితలు తవ్వితీస్తున్నా వీరికి అక్కర్లేదు.
ప్రత్యామ్నాయ మార్గంలో…
ఒకప్పుడు మిగిలిన వాటినిమెయిన్‌స్ట్రీమ్‌ పత్రికలనీ,ప్రజాశక్తి,విశాలాంధ్ర, నవతెలంగాణ వంటివాటిని వామపక్ష పత్రికలనీ అనేవారు. అయితే ఇప్పుడు ప్రజాశక్తి, నవతెలంగాణ వంటివి మెయిన్‌ స్ట్రీమ్‌కాగా చాలా పత్రికలు ఆయాపాలక పార్టీల స్ట్రీమ్‌లుగా స్టీమ్‌లుగా మారాయి విశ్వసనీయత, స్వతంత్రత, నిస్పాక్షికతలకు కట్టుబడి ప్రజల పక్షంగా యథార్థాన్ని ఆవిష్కరించే బాధ్యత పూర్తిగా మోస్తున్నది ఇవే.. అందుకే ప్రజలు వాటిని ఆదరిస్తారు, గౌరవిస్తారు. అయితే రానురాను ఈ సవాళ్లు తీవ్రమవుతాయే గాని తగ్గవు. ఎందుకంటే ప్రత్యామ్నాయ మీడియా అనేది పాలకులకు సింహస్వప్నంగా వుంటుంది. ఉదాహరణకు మోడీ అధికారంలోకి రావడానికి ఉపయోగించుకున్న సోషల్‌ మీడియానే ప్రజాస్వామిక వాదులు ఉపయోగించు కుంటే అపరాధమైపోతున్నది. సుప్రీంకోర్టు ముందు మీడియాకు సంబంధించిన కేసులెన్ని వున్నాయో చెప్పడం కష్టం.ఇలాంటి సమయంలో కాలపరీక్షకు నిలిచిన ప్రజాశక్తి, నవతెలంగాణ వంటి పత్రికలను పటిష్టం చేసుకోవడం, మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎంతైనా అవసరం. ఇటీవలి ఎన్నికలలో లౌకిక శక్తుల బలం పెరగడం, కేంద్రంలో మోడీ దూకుడుకు ప్రజలు పగ్గాలు వేయడం ప్రజాశక్తి, నవతెలంగాణ వంటి పత్రికల కృషికి ఉత్సాహమిచ్చే పరిణామం.అయితే మతతత్వ శక్తుల ప్రమాదాన్ని గానీ,కార్పొరేట్‌ ఆధిపత్య వ్యూహాలను గానీ ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. మీడియాపై ఇవే ప్రత్యేకంగా పిడికిలి బిగిస్తున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్‌ ట్రంప్‌ను బలపరుస్తున్నట్టు ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ ఆరోపించడం చూస్తున్నాం. ఇక అభ్యుదయ ఉద్యమాలు, సామాజిక న్యాయం కోరే శక్తుల సవాళ్లు మరెంత తీవ్రంగా ఉంటాయో వేరే చెప్పాలా?అందులోనూ తెలుగునాట ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని మతతత్వ బీజేపీతో ప్రత్యక్ష, పరోక్ష స్నేహానికి అర్రులు చాస్తున్న దృష్ట్యా ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్చను కాపాడుకోవడం మరింత కీలక మవుతుంది. ఇలాంటి తరుణంలో నవతెలంగాణ మార్గం ప్రజాస్వామ్య ఉద్యమాలకు, ప్రజల శ్రేయస్సుకు మరింత ఆలంబనం అవశ్యం అవుతాయి.
తెలకపల్లి రవి