ఆదిలాబాద్ లో ఈ సోమవారం ప్రజావాణి రద్దు

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 28న ఆదిలాబాద్ జిల్లాకు రానున్న నేపథ్యంలో  సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 28న ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, బీసీ వెల్ఫేర్ కమిషనర్ల తో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని, ప్రజలు దీనిని గమనించి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని పేర్కొన్నారు.