సోమవారం నుండి మండల స్థాయిలో ప్రజావాణి: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

– గ్రామస్థాయిలోనే వీలైనన్ని సమస్యలు పరిష్కారం కావాలి
– అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
జిల్లాస్థాయిలో నిర్వహించినట్లుగానే ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి  అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండలాల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
– ప్రతి సోమవారం మండల  స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఎంపీడీవో అధ్యక్షతన జరుగుతుంది.
– ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, తహసిల్దార్, ఎంఈఓ, ఏపీఎం, వ్యవసాయ అధికారి, ఐకెపి అధికారి, ఇతర మండల స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా హాజరు కావాలి.
– ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణి నిర్వహించాలి.
– పరిష్కారం అయ్యే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి, లేదా పై స్థాయికి పంపించాలి.
– ఒకవేళ పరిష్కారం కానిదైతే పరిష్కారం కాదని స్పష్టంగా తెలపాలి.
– ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలి.
– మండల స్థాయిలో పరిష్కారం కానీ ఫిర్యాదులు 15 రోజుల తర్వాత మాత్రమే జిల్లా స్థాయి ప్రజావాణికి రావాలి.
– ఫిర్యాదులన్నింటిని ప్రజావాణి  వెబ్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఐడి నెంబర్ను జనరేట్ చేయాలి.
– ప్రజావాణిలో అత్యవసర కేసులు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
– ప్రజవాని నిర్వహణ విషయమై మండల స్థాయిలో వెంటనే  అధికారులతో తక్షణ సమావేశం ఏర్పాటు చేయాలి.
జిల్లాలోని 33 మండలాలు, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లలో వచ్చే సోమవారం ప్రజావాణి నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, రెవెన్యూ అదనపు  కలెక్టర్ జె. శ్రీనివాస్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.