– హరీశ్ బురద చల్లడం మానుకో
– ప్రజల కోసం కష్టపడుతున్నాం : ప్రజావాణి ఇన్‌చార్జీ చిన్నారెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం జన ప్రభంజన వేదికగా నడుస్తున్నదని ప్రజావాణి ఇన్‌చార్జీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు బురద చల్లడం ఏమాత్రం సబబు కాదని వాఖ్యానించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. శనివారం సచివాలయ మీడియా సెంటర్లో ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో కలిసి చిన్నారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమంపై బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు పనిగట్టుకొని బురద చల్లుతున్నారని ఖండించారు. హరీశ్‌రావుపై ఉన్న కాస్త గౌరవం కూడా మంట కలిసి పోతున్నదన్నారు. హరీశ్‌రావు ఇదేం పద్ధతని ప్రశ్నించారు.
ప్రజల కష్టాలు విని, వారి నుంచి అర్జీలను స్వీకరించి మేలు చేస్తున్న ప్రజావాణిపై విమర్శలు చేస్తే పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న మాపై, సిబ్బందిపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆయన వీలుచేసుకుని ప్రజావాణికి స్వయంగా వచ్చి చూడాలని అన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజా సమస్యలను వింటూ పరిష్కారం చూపుతున్నామని వివరించారు. ప్రతివారం మంగళ , శుక్రవారాలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 92 సెషన్ల ద్వారా 92,115 అర్జీలను స్వీకరించి, అందులో 63 శాతం సమస్యలను పరిష్కరించామని తెలిపారు. 2023 డిసెంబర్ 8న ప్రజావాణిని ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. ఈ ప్రాంగణాన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ అని నామకరణం చేశారని గుర్తు చేశారు. ఇనుప సంకెళ్లను కూల్చి సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ప్రజాభవన్‌కు వచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా భవన్‌ను తీర్చిదిద్దారని వివరించారు.
విజన్ 2047 లక్ష్యంతో రాష్ట్రాభివృద్ధి
విజన్ 2047 లక్ష్యంతో రాష్ట్రాభివద్ధి కార్యాచరణ ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ” విజన్ తెలంగాణ 2047 ” సింపోజియం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధి కోసం అధికారులు సామాజిక బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. ఏ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని అమలు చేయాలనీ, అందుకు శాఖల వారీగా రోడ్ మ్యాప్ లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయం, ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శశాంక గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి, వైద్య శాఖ నిపుణులు డాక్టర్ గంగాధర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ హెడ్ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి, ఆర్థిక నిపుణులు జి ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.