– మహిళా సంఘాల డిమాండ్
హస్సన్ : అభ్యంతరకర వీడియోలు, ఫోటోలతో మహిళలను బ్లాక్ మెయిల్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన హసన్ సిట్టింగ్ ఎంపి, ప్రస్తుత ఎన్నికల్లో జెడి(ఎస్), బిజెపిల అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్‌డి రేవణ్ణలను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వాసహా పలు మహిళా, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రజల్వ రేవణ్ణకు వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన మంగళవారం హస్సన్‌లో వివిధ సంస్థలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. లైంగిక వేధింపుల బాధితుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించాయి. రేవణ్ణపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేశాయి. బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కమిషనర్ ద్వారా ఒక మెమొరాండం అందజేశాయి. నిరసనల్లో కర్ణాటక ఐద్వా ప్రధాన కార్యదర్శి దేవి, ఉపాధ్యక్షురాలు గౌరమ్మ విమల, సిఐటియు జిల్లా అధ్యక్షులు ధర్మేష్, కెపిఆర్‌ఎస్ కర్ణాటక ఆర్థిక కార్యదర్శి హెచ్‌ఆర్ నవీన్‌కుమార్, రచయిత-సామాజిక ఉద్యమవేత్త రూపా హాసన్, ఎఐఎంఎస్‌ఎస్ నాయకులు, కర్ణాటక మహిళా యూనివర్శిటీ మాజీ సబిహ భూమి గౌడ తదితరులు పాల్గొన్నారు.
జెడిఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెన్షన్
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, హసన్ సిట్టింగ్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై జనతాదళ్ (ఎస్) వేటు వేసింది. ప్రజ్వల్ అసభ్యకర వీడియోలు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, జెడిఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేయాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు చెప్పారు. ప్రజ్వలఫై సిట్‌ను స్వాగతిస్తున్నామని, సిట్ విచారణ పూర్తయ్యేవరకూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడికి సిఫారసు చేయాలని నిర్ణయించామని జెడి(ఎస్) కోర్ కమిటీ అధ్యక్షుడు జిటి దేవెగౌడ తెలిపారు.
ఏప్రిల్ 26న జరిగిన ఎన్నికల్లో హసన్ నుంచి జెడి(ఎస్), బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ప్రజ్వల్ పోటీ చేశాడు. ఐపిఎస్ అధికారి విజరుకుమార్‌సింగ్ నేతృత్వంలోని సిట్ కేసు దర్యాప్తును ప్రారంభించింది. ప్రజ్వల్ రేవణ్ణ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా విచారణ చేపట్టింది. ఈ అంశంపై మూడు రోజుల్లో వివరణాత్మక నివేదిక సమర్పించాలని కర్ణాటక డిజిపిని కోరింది.
మాజీ కారు డ్రైవర్ స్టేట్‌మెంట్ విడుదల
15 ఏళ్ల పాటు హెచ్‌డి రేవణ్ణ కుటుంబానికి డ్రైవర్‌గా పనిచేసి, గత ఏడాది నుంచి పనిమానేసిన కార్తీక్ ఈ కేసులో వీడియో స్టేట్‌మెంట్‌ను అజ్ఞాత ప్రదేశం నుంచి మంగళవారం విడుదల చేశారు. తండ్రీ కొడుకులపై లైంగిక వేధింపుల కేసులో వీడియో ఆధారాలను సిట్‌కు అందజేస్తానని తెలిపారు. తన భూమిని బలవంతంగా విక్రయించేలా చేశారని, ఆ విభేదాల నేపథ్యంలో పని మానివేసినట్లు చెప్పారు. తనపైనా, తన భార్యపైనా దాడి చేశారని వాపోయారు.
సిట్ సమన్లు
ప్రజ్వల్ రేవణ్ణ, అతని తండ్రి హెచ్‌డి రేవణ్ణలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు పేర్కొన్నారు.