పొన్నంకు మంత్రిగా కొనసాగే అర్హత లేదు : ప్రకాశ్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో కరువుకు తాము కారణం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అంటున్నాడనీ, అసమర్థులే అలాంటి సాకులు చెబుతారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. అసమర్థుడైన పొన్నం ప్రభాకర్‌కు మంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. తమ పార్టీలో రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉండి జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన ఘనత వెంకయ్య నాయుడు తర్వాత బండి సంజరుదేనని తెలిపారు. అధికార ప్రతినిధి రాణి రుద్రమ మాట్లాడుతూ.. బండిని అధ్యక్ష పదవి నుంచి తొలగించలేదనీ, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్‌ అయ్యారని చెప్పారు. పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యాక రవాణా శాఖలో చాలా బదిలీలు జరిగాయనీ, ఆయన అవినీతికి పాల్పడకుండా బదిలీల ప్రక్రియ చేయించారా? అనేది సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని సవాల్‌ విసిరారు. గంగుల, కేటీఆర్‌తో సన్నిహిత్యం పొన్నంకే ఉందన్నారు. మహిళలకు రూ.2500, రైతుబంధు, రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మరో నేత కుమార్‌ మాట్లాడుతూ..నేరెళ్ల ఘటనలో దళితుల పక్షాన పోరాడింది బండి సంజరునే అనీ, కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రప్పించారని గుర్తుచేశారు.