
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని అష్ట గ్రామంలో రామాలయ కమిటీ సభ్యులు- గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు ముగిశాయి. గత మూడు రోజుల నుండి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలను బాసర ఆలయంలోని వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి సమయాల్లో ఆష్ట దిగంబర్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామంలో ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొంది. ముగింపు ఉత్సవాలకు ముధోల్ మాజీ ఎమ్మెల్యేలు బి నారాయణరావు పటేల్, జి. విట్టల్ రెడ్డి, భైంసా మార్కేట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్, హాజరయ్యారు. శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రామాలయ చైర్మన్ ఆర్మూర్ సంతోష్ రెడ్డి తో పాటు సభ్యులు మాజీ ఎమ్మెల్యేలను శాలువాతో సన్మానించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమైంది. ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు గ్రామస్తులు ఐక్యంగా మూడు రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలను ఎలాంటి లోటుపాటు లేకుండా విజయవంతం చేశారు. గ్రామ ఆడబిడ్డలకు రామాలయ కమిటీ ఆధ్వర్యంలో కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ వైస్ చైర్మన్ సుకన్య రమేష్, సురుగుల పోశెట్టి అశోక్, రావుల పోశేట్టి, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, మురళి, రావుల శ్రీనివాస్, రామాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.