ప్రణరు ప్రతాపం

– ఇండోనేషియా ఓపెన్ సూపర్‌ సిరీస్‌
– సెమీఫైనల్లో అడుగుపెట్టిన స్టార్‌ సట్లర్‌
– క్వార్టర్స్‌లో వరల్డ్‌ నం.4 కొడారుపై గెలుపు
– సాత్విక్‌, చిరాగ్‌ జోడీ సైతం ముందంజ

జకర్తా (ఇండోనేషియా)
భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు సత్తా చాటుతున్నాడు. ఇటీవల మలేషియా ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన హెచ్‌.ఎస్‌ ప్రణరు తాజాగా ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలోనూ చెలరేగుతున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.4, మూడో సీడ్‌ కొడారు నరొకపై 21-18, 21-16తో వరుస గేముల్లో ఘన విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి సైతం దుమ్మురేపారు. టాప్‌ సీడ్‌, ఇండోనేషియా స్టార్స్‌ ఫజర్‌, మహ్మద్‌ రియాన్‌లపై వరుస గేముల్లో ఎదురులేని విజయం నమోదు చేశారు. మెన్స్‌ సింగిల్స్‌లో ప్రణరు, మెన్స్‌ డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ సెమీఫైనల్స్‌కు చేరుకోగా.. మెన్స్‌ సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లో పరాజయం పాలయ్యాడు.
సూపర్‌ ప్రణరు : కొడారు నరొకతో క్వార్టర్‌ఫైనల్స్‌కు ప్రణరు అండర్‌డాగ్‌గా బరిలో దిగాడు. గతంలో ఆడిన నాలుగు ముఖాముఖి మ్యాచుల్లో ప్రణరు ఒక్కదాంట్లోనూ గెలుపొందలేదు. కానీ ప్రపంచ శ్రేణి క్రీడాకారులతో తలపడినప్పుడు ప్రణరు అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాడు. ఇండోనేషియా ఓపెన్‌లో ప్రణరు అదే చేశాడు. 55 నిమిషాల క్వార్టర్‌ఫైనల్లో వరుస గేముల్లోనే గెలుపొందాడు. తొలి గేమ్‌లో 9-9తో సమవుజ్జీలుగా నిలిచిన సమయంలో వరుసగా ఐదు పాయింట్లు సాధించిన ప్రణరు ముందంజ వేశాడు. 16-16, 18-18 వద్ద మరోసారి కొడారు స్కోరు సమం చేసినా.. చివర్లో వరుస పాయింట్లతో ప్రణరు తొలి గేమ్‌ గెల్చుకున్నాడు. ఇక కీలక రెండో గేమ్‌లో కొడారు గట్టిగా పోరాడాడు. 9-12తో ఓ దశలో ప్రణరు వెనుకంజలో నిలిచాడు. 12-12తో స్కోరు సమం చేసిన ప్రణరు ద్వితీయార్థంలో దూసుకెళ్లాడు. 17-16తో మ్యాచ్‌ ఉత్కంఠ రేపగా.. వరుస పాయింట్లతో రెండో గేమ్‌ను, సెమీఫైనల్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్‌ నిరాశపరిచాడు. 14-21, 21-14, 12-21తో మూడు గేముల మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. చైనా షట్లర్‌ లి షి ఫెంగ్‌ తొలి, మూడో గేములు గెలుపొంది సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ టాప్‌ సీడ్‌పై గెలుపొందారు. 41 నిమిషాల మ్యాచ్‌లో 21-13, 21-13తో భారత జోడీ మెరుపు విజయం సాధించింది. తొలి గేమ్‌లో 6-6 అనంతరం ఇండోనేషియా జోడీ నుంచి మనోళ్లకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. వరుస పాయింట్లతో సాత్విక్‌, చిరాగ్‌ అదరగొట్టారు. రెండో గేమ్‌లోనూ పరిస్థితి పెద్దగా మారలేదు. 7-7 వరకు ఇండోనేషియన్లు పోటీ ఇచ్చారు. ఆ తర్వాత సాత్విక్‌, చిరాగ్‌ దూకుడుకు చేతులెత్తేశారు.