క్వార్టర్స్‌లో ప్రణయ్‌

– సాత్విక్‌, చిరాగ్‌ జోడీ సైతం
– ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు సత్తా చాటుతున్నారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకోగా.. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ సైతం క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మెన్స్‌ డబుల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌లు 21-14, 21-15తో వరుస గేముల్లో గెలుపొందారు. రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌లు చైనీస్‌ తైపీ జోడీని చిత్తు చేశారు. రెండు గేముల్లోనూ చైనీస్‌ తైపీ జోడీ చింగ్‌, యాంగ్‌ నుంచి మనోళ్లకు ప్రతిఘటన ఎదురుకాలేదు. నేడు క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్‌, డెన్మార్క్‌ జోడీ కిమ్‌, ఆండర్స్‌తో సాత్విక్‌, చిరాగ్‌లు అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో సహచర షట్లర్‌ ప్రియాన్షు రజావత్‌పై హెచ్‌.ఎస్‌ ప్రణరు పైచేయి సాధించాడు. మూడు గేముల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 20-22, 21-14, 21-14తో ప్రణరు సాధికారిక విజయం నమోదు చేశాడు. నేడు సెమీస్‌ బెర్త్‌ కోసం చైనీస్‌ తైపీ షట్లర్‌ వాంగ్‌ జువీతో ప్రణరుతో పోటీపడనున్నాడు.