-3 వారాలు ఆటకు దూరం
-నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్
ఒడెన్సె (డెన్మార్క్) : భారత బ్యాడ్మింటన్ వెటరన్ క్రీడాకారుడు, ఆసియా క్రీడల పతక విజేత హెచ్.ఎస్ ప్రణయ్ గాయం బారిన పడ్డాడు. ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన ప్రణయ్.. 41 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ సయ్యద్ మోడీ తర్వాత ఆ ఘనత సాధించిన భారత షట్లర్‌గా నిలిచాడు. మెన్స్ జట్టు విభాగం ఫైనల్స్‌కు గాయం కారణంగా దూరమైన ప్రణయ్.. మెన్స్ సింగిల్స్‌లో వెన్ను నొప్పితోనే బరిలో నిలిచాడు. వెన్నునొప్పి కారణంగా రానున్న కీలక టోర్నీలకు ప్రణరు దూరం కానున్నాడు. ‘ ఈ నెల ఏ టోర్నీలో ఆడలేను. ఎంఆర్‌ఐ స్కాన్ నివేదిక సైతం వచ్చింది. 2-3 వారాలు విశ్రాంతి అవసరమని సూచించారు. డెన్మార్క్, ఫ్రాన్స్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నాను. విరామం తీసుకుని, ఆ తర్వాత రిహాబిలిటేషన్ మొదలుపెడతాను’ అని హెచ్.ఎస్ ప్రణయ్ తెలిపాడు. ప్రణరు తప్పుకోగా.. యువ షట్లర్ లక్ష్యసేన్, మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్‌లు మెన్స్ సింగిల్స్ విభాగంలో టైటిల్ ఆశలతో బరిలోకి దిగనున్నారు. డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ.. ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి జంట బరిలో నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు సైతం ఫామ్ అందుకునేందుకు ఎదురుచూస్తుంది. ఇటీవల ఆర్కిటిక్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన సింధు.. బిడబ్ల్యూఎఫ్ 750 సూపర్ టోర్నీలో సత్తా చాటాలని భావిస్తుంది. డెన్మార్క్ ఓపెన్ నేటి నుంచి ఆరంభం కానుండగా.. బుధవారం నుంచి ప్రధాన మ్యాచులు జరుగుతాయి.