– అర్హులైన వారికి దళిత బంధు, బీసీ బంధు ఇవ్వాలి
– ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తే ఆందోళన
– కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్
నవతెలంగాణ-మర్పల్లి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్‌దే గెలుపు అని మండలాధ్యక్షుడు యు రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. మండలంలో పార్టీ బలోపేతానికి గ్రామ గ్రామాన అన్ని కమిటీలు వేసుకొని ఎన్నికలకు సిద్ధమవుతామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధు, బీసీ బంధు వారి వారి అనుచరులకే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దళితుల్లో బీసీల్లో ఎంతోమంది అర్హులున్న వారిని కాదని వారి కార్యకర్తలకు ఇవ్వడం న్యాయం కాదని విమర్శించారు. దళిత బంధు విషయమై వచ్చే 20న మర్పల్లి మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మర్పల్లి మండలానికి చెందిన ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నా అధికార పార్టీ నాయకులకు చీమ కుట్టినట్టు కూడా లేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం మర్పల్లి మండలానికి సంబంధించిన పంచాయతీరాజ్ డివిజన్ ఇంజనీర్ ఆఫీసును తాండూర్ పట్టణానికి తరలించడం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం కష్ణారెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షులు టి సురేష్,మర్రి లక్ష్మారెడ్డి, ఐ రాచన్న, మండల ఉపాధ్యక్షులు జి గోపాల్,ఎల్ ప్రభాకర్ రెడ్డి,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రభాకర్, టి గణేష్, భుచన్పల్లి ఎంపీటీసీ ఎ బాల్ రెడ్డి, రావులపల్లి సర్పంచ్ అబ్రహం, మాజీ సర్పంచ్ వైద్యనాథ్, శేఖర్, సాయి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శేఖర్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమేష్, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పరి రమేష్, మన్మోహన్, నాయకులు బలవంత్‌రెడ్డి, శివ, మారుతి, పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు మండలం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించవద్దని తహసీల్దార్ గణేశ్‌కు వినతిపత్రం అందజేశారు.