ప్రసేన్‌ఏసినిమా

PrasenAcinemaThe Immediate Experience
సినిమా కూడా సాహిత్యమే అని నమ్మి సినిమాను బాధ్యత, నిబద్దతగల మీడియంగా గుర్తించి సినీ విశ్లేషణ, పరిచయాలను ఓ దీక్షగా నిర్వహిస్తున్న ప్రసేన్‌ సినీ సమీక్షల సంకలనం ఈ ”ప్రసేన్‌ఏసినిమా” ”నేను తెలుగు సినిమాను తిట్టినా, ఎటకరించినా, విమర్శించినా కేవలం మంచి సినిమా కోసమే, సినిమా మంచి కోసమే, మంచి సినిమా రావాలన్న తపనతోనే. మంచి సినిమా వస్తుందన్న ఆశతోనే” అంటారు ప్రసేన్‌ ఈ పుస్తకం ముందుమాటలో.
సినీ విమర్శకులపై ఎందరికో కోపం ఉంటుంది. ముఖ్యం గా ఏ ప్రలోభాలకు, మార్కెటింగ్‌ మాయా జాలా నికీ, ఫాన్‌ ఫియర్‌కి లొంగకుండా సినిమాని విమర్శించే వారు ఎదుర్కునే కోపతాపాలు చాలా ఎక్కువ. అయినా సినిమా గురించి కొందరు రాస్తూనే ఉంటారు. దీనికి కారణం మంచి సినిమాపై ఆశ, ప్రేమ వారిలో నిండుగా ఉండడమే. ప్రస్తుతం సినిమాను విపరీతంగా మార్కెట్‌ చేసి అర్హతలేని సినిమాలకు కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఇప్పించేసి ఇక ఆ సినిమాలో ఏం ఉందీ అన్న ఆలోచన రానీయకుండా సామాన్యుల నోర్లు మూయించే ట్రెండ్‌ ఎక్కువగా నడుస్తూ ఉంది. ప్రేక్షకుల నోర్లు మూయించి మెదళ్ళు పని చేయనీయకుండా చేసి సినిమా స్థాయిని దిగజార్చే సంస్కతి ప్రస్తుతం తెలుగు సినిమాలో రాజ్యం ఏలుతుంది. ఇది కళకు జరుగుతున్న అతిపెద్ద ద్రోహం. దీన్ని ఎదిరించడానికి శక్తివంతమైన విమర్శకుల అవసరం ఉంది. వీరు ఎమోషన్లతో కొట్టుకుపోతున్న అభిమాన సంఘాలతోనూ, సినిమాను ధనార్జనకు సాధనంగా మాత్రమే చూసే వ్యవ్యస్థ తోనూ పోరాడవలసి వస్తుంది. ఓ పెద్ద హీరో సినిమా బాలేదంటే ఎందరినో శత్రువులను చేసుకోవలసి వస్తుంది. చాలా సందర్భాలలో వీరిది ఒంటరి పోరాటమే.
బాధ్యతతో ప్రవర్తించే సినీ విమర్శకుల కొరత తెలుగు సినిమాలో ఉంది. సినిమా మార్కెటింగ్‌ కోసం వనరులుగా ఉపయోగపడే సినీ విమర్శకుల మధ్య సినిమాను ఏ ప్రలోభాలకూ లొంగకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రసేన్‌ ఈ సంక్షిప్త సినీ పరిచయాలను చదివి, తెలుగు సినిమా ఎంతటి అధోగతిలోకి పడిపోయి ఉందో తెలుసుకుంటే తప్ప మళ్ళీ తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చే అవకాశం లేదు. మన మెదళ్ళు పనిచేయకుండా మ్యూట్‌లోకి నెట్టేసే మార్కెటింగ్‌ మాయాజాలనికి దూరంగా, నిజాన్ని నిజాయితీతో చూసి ప్రశ్నించే ఇటువంటి సినీ విమర్శల అవసరం తెలుగు సినిమాకు ప్రస్తుతం ఎంతో ఉంది. అందుకే తెలుగు సినిమాను ఆయన చీల్చి చెండాడారు, ప్రశ్నించవలసిన సమయంలో సూటిగా ప్రశ్నించారు.
‘ఆచార్య’ కు సాఫ్రన్‌ సలాం ఇచ్చినా, ‘వీరసింహారెడ్డి’ ని వీర హింసారెడ్డి అని చెప్పినా, ‘ఎఫ్‌’ అనగా ఫెయిల్యూర్‌ ప్రేక్షకుడు, పాడిందే సర్కారు వారి పాట అని వ్యంగ్యోక్తులు విసిరినా, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ని సప్పుడెక్కువ సరుకు తక్కువ, ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ ని చెడ్డ కషాయం రేపటి అపాయం, ‘వకీల్‌ సాబ్‌’ ని ఏ కీలు కా కీలు విరిచేసారు కదా సాబ్‌ అంటూ విమర్శించినా అందులో వీరి సినిమా ప్రేమ మాత్రమే కనిపిస్తుంది.
కొన్ని సినిమాలను సమీక్షిస్తూ ఆయన కలం ఎన్నో ఆలోచనలనూ రెకెత్తించింది. ”భావోద్వేగాలు 24 ఫ్రేముల్లో ఒక్క టంటే ఒక్కదాంట్లో మచ్చుకయినా లేకపోవడం ”అఫీసర్‌”లో లోపం అని చెప్పడం వెనుక సినిమాలో భావోధ్వేగాలపై దష్టి పెట్టండని సినీవర్గాన్ని కోరే ఓ సినీ ప్రేమికుడు కనిపిస్తాడు. ”సినిమా చూసే వాళ్లను ఫాన్స్‌ అనీ, ప్రేక్షకులనీ రెండు ముక్కలు చేసి ఫ్యాన్స్‌కు పెద్దపీట వేసి, ప్రేక్షకులను చిన్నచూపు చూస్తున్నందుకూ… సినిమా మధ్యమాన్ని కేవలం మానసిక దౌర్భల్యాలను ప్రేరేపించే ‘మాత్ర’గా మాత్రమే స్థిరీకరించి నందుకూ, సకల దౌర్భాగ్యాలనూ వెండితెర మీద విజయ వంతంగా పులిమి కూడా బాహుబిలిగా బతికేస్తున్నందుకూ.. ఇంకా చాలా చాలా వాటికి క్షమించాలి తెలుగు సినిమాను” అంటారు ప్రసేన్‌. సినీ ప్రపంచం దీని తర్వాత కూడా ఆలోచించకపోతే అది ప్రేక్షకుల పట్ల వారికున్న చులకన భావం మాత్రమే.
గ్రామాలను దత్తత తీసుకోవాలనే నేపథ్యంతో వచ్చిన ఓ సినిమాను సమీక్షిస్తూ అయన ”టెల్గు సినిమాను ఎవరు దత్తత తీసుకోవాలిట” అని ప్రశ్నించే విధానం నవ్వు తెప్పించినా, అందులో అంతర్లీనంగా ఉన్న భాధ సినీ ప్రేమికులకే అర్థం అవుతుంది. ”సమూహాలు పరిష్కరించుకోవలసిన సమస్యలను వ్యక్తులే దేవదూతలుగా వచ్చి లెక్కలు తేల్చిపారేస్తున్న అసహజతను మనం గమనించలేమా” అంటూ ఆయన ఆవేదన చూపించడంలో ప్రేక్షకులకు కనీస గౌరవం ఇవ్వని ప్రస్తుత తెలుగు సినిమాపై కోపం కూడా ఉంది.
ఓ సినిమా హిట్‌ అవడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. కాని సినిమా హిట్‌ అయిందని సంతోషించలేక పోతు న్నాడు విజ్ఞత గల ప్రేక్షకుడు. ”సినిమా హిట్టే… కాని జరగ కూడందేదో జరుగుతోంది. గెలవాల్సిన వాడు గెలువకపోయినా పర్వాలేదు కాని ఓడాల్సినవాడు గెలుస్తున్నాడు. తస్మాత్‌ జాగ్రత్త.” అంటూ హిట్‌ అవుతున్న సినిమాల వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సంకోచించట్లేదు ప్రసేన్‌ అనే ఈ సినీ ప్రేమికుడు.
‘హీరోయిన్లు వేశ్య పాత్ర పట్ల ఎంత పాషన్‌తో ఉంటారో ఇప్పుడు హీరోలు విలన్‌ పాత్రల పట్ల అంతే పాషన్‌ చూపిస్తున్నారు’ అంటూ మరో చోట రాస్తూ మారుతున్న హీరో స్థానాన్ని చూపిస్తున్నారు. చెడు పట్ల ఆకర్షణను కమర్షియలైజ్‌ చేస్తున్న తెలుగు సినిమా స్థితికి కారణాలు వెతకవలసిన అవసరం ఇంకానూ రాలేదంటారా?
”సామాజిక సమస్యలను వ్యాపార సినిమా ప్రతిబింబిస్తోం దని సంబరపడాలో పిచ్చి పరిష్కారాలు చూపించి చేతులు దులుపుకుంటోందని బాధపడాలో అర్థంకాని స్థితిలోకి తెలుగు ప్రేక్షకుడిని నెడుతున్న సినిమాల పరంపరలో ఇంకో సినిమా ‘మహర్షి’, ‘రక్తమాంసాలు’, రూపురేఖలూ అందచందాలూ అన్నీ ఉండి ఆత్మలేని సినిమా ‘రంగస్థలం’.” సినిమా ఎంత బాగుం దంటే ‘సైరా’ పాత్రను లార్జర్‌దాన్‌ లైఫ్‌గానే ప్రదర్శించినా చిరు అంతకంటే పైన మెగా సైజ్‌లో నిలబడ్డంత అంటూ సూటిగా నిజాలను చెప్పడానికి చాలా తెగువ కావాలి.
”ఒక మంచి కెమెరామెన్ను, ఒక గొప్ప ఎడిటర్‌ను పక్కన పెట్టేసుకుంటే ఏ రచయితయినా దర్శకుడైపోవచ్చు” అన్నట్లుగా ప్రవర్తించే నేటి సినీ దర్శకుల స్థితిని ఆయన ఎండగట్టారు. ఒకప్పటి ప్రజాదరణ పొందిన దర్శకులు పూరీ జగన్నాధ్‌, రాం గోపాల్‌వర్మ లాంటి దర్శకుల లేటెస్ట్‌ సినిమాలను కూడా అదే స్థాయిలో విమర్శించడం వీరి నిష్పక్షపాత వైఖిరికి ప్రతిబింబం.
”నా వరకు నాకైతే పెద్ద సినిమా కొంచెం బాగాలేకపోయినా ఎక్కువ చిరాకు, అదే చిన్న సినిమా కొంచెం బాగున్నా ఎక్కువ ఆనందం” అంటూ చిన్న సినిమాలను ప్రోత్సహించే దశగా ఈ పుస్తకంలో కొన్ని వ్యాసాలున్నాయి. ఎక్కడ ఆ సినిమాలో లోటు పాట్లున్నాయో సూచిస్తూ, వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ మరో సినిమా సందర్భంలో ఆ టీం గుర్తు పెట్టుకోవలసిన విషయాలను సమీక్షలలో ప్రస్తావించడం వల్ల నేర్చుకోవాలనుకునే కోరిక ఉన్న సినీ మేకర్లకు ఎంతో ఉపయోగపడతాయి ఈ వ్యాసాలు.
సినిమాలో క్షీణిస్తున్న సాహితీ విలువలను ఎత్తి చూపడంలో వీరు సందేహించలేదు. సినీ కథా రచయితలు సంభాషణల రచయితల అవసరాన్ని నొక్కిచెపుతూ సంభషణలు సినిమా స్థాయిని ఎలా పెంచగలవో కొన్ని సందర్భాలలో ఉదహరిస్తూ వెళ్లారు. ”మన సినిమా పాటల్లోనే బోలెడంత రేపిజం, బోలెడంత మంది రేపిస్టులూ, లెక్కలేనన్ని అత్యాచారాలూ..” అంటూ ఆయన ఉదహరించిన సినీ సాహిత్యం తెలుగు వారి దిగజారిన సాహితీ విలువలను దర్పణం. తెలుగు సినిమా పూర్తిగా మార్కెటీ కరించబడడం గురించి ప్రసేన్‌ గారిలో చాలా బాధ ఉంది. ”విషాదా మేంటంటే మనమే మార్కెట్‌ సష్టించి దాని కొమ్ములకు మనమే పదునుపెట్టి, ఇప్పుడు కుమ్మేస్తున్నాయి బాబోరు అని గుండెలు బాదుకోవడం. ప్రస్తుతం తెలుగు సినిమాను రక్షించగలిగేది ప్రేక్షకులే, తమను తెలివి లేని దద్దమ్మలుగా ఎంచే సినీ వర్గాన్ని తోసిపుచ్చి మంచి సినిమా దిశగా సినీ రంగాన్ని మళ్లించగల శక్తి కేవలం ప్రేక్షకుడికే ఉంది. మార్కెట్‌ మాయాజాలానికి లొంగక, గుడ్డి అభిమానాన్ని వదిలి, వ్యక్తిగత ఇష్టాలను దాటు కుని, హీరోయిజం అనే మాయనుండి బైటపడి, మంచి సినిమాలు తెలుగులో రావడానికి ఉద్యమించవలసింది ప్రేక్షకుడే. అటువంటి ప్రేక్షకులను తయారు చేయగల సినీవిమర్శ ”ప్రసీన్‌ ఏ సినిమా” ఇందులోని నిష్పక్షపాత విమర్శ ఆలోచింపజేస్తుంది. అయితే కొన్ని వ్యాసాలు అతి క్లుప్తంగా ఉన్నట్లు నాకు అనిపించాయి. ఆ ఒక్క విషయంలో తప్ప సినిమాను అభిమా నించే వారికి పూర్తి సంతప్తినివ్వగల సినీ విమర్శాత్మక పుస్తకం ఇది.

– పి.జ్యోతి, 98853 84740