– నలుగురు మృతి, పలువురికి గాయాలు
మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో క్రైస్తవుల ప్రార్ధనలపై ఆదివారం శక్తివంతమైన బాంబు దాడి జరగడంతో నలుగురు మరణించారని, దాదాపు 50మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరావి నగరంలోని ఒక యూనివర్శిటీ జిమ్నాజియంలో ప్రార్ధనా సమావేశం జరుగుతుండగా ఈ పేలుడు సంభవించింది. గాయపడిన వారిలో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారని, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారని సెక్యూరిటీ చీఫ్ తాహా తెలిపారు. ఈ సంఘటన తీవ్రవాద చర్యేనని ఆయన వ్యాఖ్యానించారు. ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణ కాదని, బాంబు దాడి జరిగితే చుట్టుపక్కలనున్నవారు కూడా మరణిస్తారని అన్నారు. కాగా, మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలే. వెంటనే సైనిక బలగాలు, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ దాడికి బాధ్యులెవరో తెలుసుకుని వారిపై చర్య తీసుకుంటామని ప్రకటించారు.