ముందస్తు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి

Pre-training programs should be arranged– చనిపోయిన ఓటర్లను జాబితా నుండి తొలగించాలి 
– కుటుంబం మొత్తం ఒకే పోలింగ్ కేంద్రంలోకి వచ్చేలా చూడాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై ముందస్తు ఏర్పాట్లలో భాగంగా బిఎల్ఓ మొదలుకొని ఏఈఆర్ఓల వరకు  ముందుగా జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వారిగా బిఎల్వోలు, బిఎల్ఓ సూపర్వైజర్లను నియమించాలని ఆదేశించారు. శనివారం  ఓటరు జాబితా సవరణ సందర్బంగా ముందస్తు ఏర్పాట్ల పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమవారం నాటికి అన్ని పోలింగ్ కేంద్రాలకు బిఎల్వోలు, బిఎల్ఓ, సూపర్వైజర్ల నియామకాన్ని పూర్తిచేయాలని అనంతరం బిఎల్ఓ మొదలుకొని ఏఈఆర్ఓ వరకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండేలా  బిఎల్ఓ నుండి ఏఈఆర్ఓ వరకు ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. బిఎల్ఓ యాప్ ను ఏ విధంగా వినియోగించాలో  బిఎల్ ఓ శిక్షణ కార్యక్రమంలో తెలియజేయాలని, ముఖ్యంగా ఫారం -7 ద్వారా చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా  చిరునామా మారిపోయిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం, ఫామ్ -7 జనరేట్ చేయడం వంటి అంశాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో పట్టణ ప్రాంతంలో ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఓటరు  జాబితా సవరణ సందర్భంగా ఒక కుటుంబం మొత్తం ఒకే పోలింగ్ కేంద్రంలోకి వచ్చేలా, అదేవిధంగా ఒక కాలనీ మొత్తం ఓకే పోలింగ్ కేందం పరిధిలోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు.బి ఎల్ ఓ లకు ఓటరు జాబితా, షెడ్యూల్, రిజిస్టర్ లను అప్పగించాలని, అలాగే రిపోర్టింగ్ విధానాన్ని సైతం తెలియజేయాలన్నారు.ఓటరు జాబితా పై నిర్వహించే  ఇంటింటి  పరిశీలన ను బిఎల్వోలు సక్రమమైన పద్ధతిలో నిర్వహించేలా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అన్ని ఫారాలకు సంబంధించిన రిజిస్టర్ లను నిర్వహించాలని, ఓటరు లిస్టు తో పాటు,బిఎల్ఓ రిజిస్టర్లు అప్పగించాలని అన్నారు.
బిఎల్ఓ ల ఖాళీలను తక్షణమే చేపట్టాలి..
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బిఎల్వోల ఖాళీలు ఉన్నచోట తక్షణమే నియామకం చేపట్టాలని,శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతిబిఎల్ఓ కు ఓటరు జాబితాను అందజేసి ప్రతి గ్రామం వారిగా వారి పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే మ్యాప్ ను సైతం ఇవ్వాలని, ఇంటి నెంబర్లు,వారి పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ పరిధిలో ఎంతమంది ప్రముఖ ఓటర్లు ఉన్నారనే వివరాలను సైతం బిఎల్ఓ లకు అప్పగించాలని తెలిపారు. వీలైనంత త్వరగా ఓటరు జాబితా  ఇంటింటి పరిశీలనను ప్రారంభించాలని అన్నారు. చనిపోయిన ఓటర్ల తొలగింపు, ఓటరు జాబితాలో తప్పుల సవరణ, ఫోటో ఓటరు గుర్తింపు కార్డుల లో సమస్యలను అధిగమించడం, తదితర అన్ని అంశాలను పరిశీలించుకోవాలని చెప్పారు. ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశం నిర్వహించి మినిట్సు సైతం రికార్డ్ చేయాలని ఆదేశించారు. అలాగే ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని, వీటన్నిటిని బిఎల్ఓ యాప్ ద్వారా నిర్వహించాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు రాష్ట్ర స్థాయి నుండి అదనపు సి ఈ ఓ లోకేష్ కుమార్ పాల్గొనగా,జిల్లా నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు టీ. పూర్ణచంద్ర ,జే. శ్రీనివాస్, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ఆర్డీవోలు రవి, శ్రీనివాసరావు, శ్రీరాములు, ఎలక్షన్  డిటి విజయ్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.