
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ముందస్తు చర్యలను చేపట్టినట్లు మండల పంచాయతీ అధికారి సదానంద్ తెలిపారు. గురువారం హాస కొత్తూర్, చౌట్ పల్లి గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ జ్వరం, దోమల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో మురికి కాలువలను శుభ్రం చేయించడంతోపాటు, గ్రామంలో అన్ని వాటర్ ట్యాంక్ ల వద్ద గ్రామ పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చలిస్తున్నట్లు వివరించారు.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోని చెత్తను వీధిలో, మురికి కాలువలలో పాడేయకుండా ఇంటిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా గ్రామపంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో నిల్వ ఉంచుకొని గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నరసయ్య, గంగా జమున, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.