చిన్నతనం నుండే మెదడు పక్షవాతంతో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం తండ్రి చేయని ప్రయత్నం లేదు. అయినా ఫలితం లేదు. ఇక నా జీవితం ఇంతే అంటూ కుంగిపోలేదు. తానేంటో నిరూపించుకోవాలనుకుంది. ఆరోగ్యం సహకరించకపోయినా తన సత్తా చాటాలనుకొని అహర్నిశలూ శ్రమించింది. ఆమే 23 ఏండ్ల ప్రీతీ పాల్. ఇప్పుడు ఇండియాకు ముద్దుబిడ్డగా మారింది. దేశానికి పతకం అందించాలని కలలు కన్నది. తన కలను సాకారం చేసుకుని కేవలం 48 గంటల్లోనే రెండుసార్లు పారిస్ పారాలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. 200 మీటర్ల రేసులో కాంస్యం గెలుచుకుంది, దీనితో పారాలింపిక్ గేమ్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో భారతదేశం నుంచి రెండు పతకాలు సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె పరిచయం…
పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతీ పాల్ విజయగాథ ఎందరికో ఆదర్శం. అయితే ఆమె ఈ ప్రయాణం అంత సులభం ఏమీ కాదు. ప్రీతి యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా హషంపూర్ గ్రామంలో 2000, సెప్టెంబరు 22న పుట్టింది. చిన్నప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీ(మెదడు పక్షవాతం) అనే వ్యాధితో బాధపడుతోంది. ప్రీతి తండ్రి అనిల్ కుమార్ పాల్ పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. తన నలుగురు తోబుట్టువులలో ప్రీతి రెండవది.
అద్భుతాలు చేస్తున్న ప్రీతి
మీరట్‌లో ప్రీతికి మెరుగైన వైద్యం అందలేదు. దాంతో అనిల్ కుమార్ ఎలాగైనా తన కూతురు ఆరోగ్యం మెరుగుపడాలనే తపనతో మీరట్ నుంచి ఢిల్లీకి తీసుకుని వెళ్లి మరీ చికిత్స చేయించారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఇక చిన్నతనం నుండి తండ్రి కష్టాలు చూస్తూ పెరిగిన ప్రీతి జీవితంలో ఏదైనా సాధించాలని భావించింది. తన శారీక అభివృద్ధిలో ఎలాంటి మార్పూ రాదని ఆమె గ్రహించింది. తనని తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. తనకు వచ్చిన దానినే శక్తిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తీసుకుని తన ప్రయాణం మొదలుపెట్టింది. కోచ్ గజేంద్ర సింగ్ వద్ద శిక్షణ తీసుకుంటూ నెమ్మదిగా జీవితంలో పురోగతి నిచ్చెనలను అధిరోహించడం ప్రారంభించింది.
పారిస్ కంటే ముందు
ప్రీతి టి35 విభాగంలో మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల ఈవెంట్లలో పోటీ చేస్తుంది. 2024 వేసవి పారాలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించింది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత జెండాను ఎగురవేయడానికి ముందు ప్రీతి ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా తన పేరును లిఖించుకుంది. 2024లో జపాన్‌లో జరిగిన ఆ పోటీలో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లో ఒకదాని తర్వాత ఒకటి రెండు పతకాలు సాధించడం ద్వారా త్రివర్ణ పతకాన్ని రెండు సార్లు ఎగురవేసే అవకాశం లభించింది.
మానసిక ధైర్యంతో
మే 2024లో జపాన్‌లోని కోబేలో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లోనూ ఆమె కాంస్యం గెలుచుకుంది. మహిళల టి35 200 మీ. ఈవెంట్లో 30.49 సెకన్లలో సాధించి ఆమె ఒలింపిక్ కోటాను గెలుచుకుంది. అయితే చైనాలోని హాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా పారా గేమ్స్‌లో రెండుసార్లు పతకాన్ని కోల్పోయింది. మార్చి 2024లో బెంగళూరులో జరిగిన దేశీయ 6వ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో రెండు స్వర్ణాలు గెలుచుకుంది. ఇలా అనారోగ్యం ఆమెకు సహకరించకపోయినా మానసిక ధైర్యంతో విజయపథంలో ముందుకు సాగుతోంది. దేశానికి పతకాల వర్షం కురిపిస్తూ ఇండియాకు ముద్దుబిడ్డగా మారింది.
పెండ్లికి సమస్యలు వస్తాయన్నవారే…
ఓ చిన్న గ్రామంలో పాలు అమ్మే వ్యక్తి కూతురు ఇప్పుడు ఇండియాకే గర్వకారణంగా మారింది. తన కూతురు వికలాంగురాలు కనుక పెండ్లికి సమస్యలు వస్తాయని చాలా మంది తనతో బాధపడుతూ చెప్పేవారని ప్రీతి తండ్రి అనిల్ కుమార్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు అలా మాట్లాడిన వారే పారిస్ ఒలింపిక్స్‌లో విజయం సాధించిన తర్వాత ‘మీ అమ్మాయి చాలా బాగా ఆడింది’ అంటూ తనకు చెబుతున్నారని పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట తన కూతురు మరింత పెంచేలా చేసింది అంటూ ఆయన ఎంతో గర్వంగా చెబుతున్నారు.