– ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజావాణి కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజల నుండి అందే ఫిర్యాదులను పరిష్కరిం చడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు. ముఖ్య మంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆయన్ని ‘ప్రజావాణి’ పర్యవేక్షణ కోసం నియమించిన విషయం తెలిసిందే. మంగళవారం నాడాయన మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగ, ఉపాధి కల్పనకై అధిక సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్నందున వాటిని పరిష్కరించ డానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మంగళవారం జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి 1,869 ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెవెన్యూ , పోలీస్ , మున్సిపల్ , పౌరసరఫరాల శాఖ, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖ, ఉపాధి, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, పరిశ్ర మలు, అటవీ, విద్యుత్, నీటిపారుదల, దేవాదాయ తదితర శాఖలకు సంబంధించి 16 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామనీ, ప్రజలు నేరుగా తమ అర్జీలను అధికారులకు అందచేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రజావాణి ప్రత్యేక అధికారి, సీడీఎమ్‌ఏ శ్రీమతి దివ్య, ఇతర అధికారులు కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.