స్వల్పనిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యం

Preference will be given to projects that can be completed with small funds– రూ. 28 వేల కోట్ల కేటాయింపు గతంతో పోలిస్తే రూ.2 వేల కోట్లు అధికం
– అవినీతిపై సమరభేరి
– బడ్జెట్‌లో ప్రస్తావన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
స్వల్ప నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రాజెక్టులు సాంతం అవినీతికూపాలుగా తయారయ్యాయని విమర్శలకు దిగింది. ఇందుకు కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లల్లో చోటుచేసుకున్న పరిణామాలను సాక్షంగా చూపిస్తున్నది. ఇప్పటికే 70 నుంచి 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు తాజా 2024-25 ఒటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో నిధులు ప్రతిపాధించింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 28,024 కోట్లు ప్రతిపాదించింది. ఇది గత బడ్జెట్‌తో పొలిస్తే రూ.2 వేల కోట్లు అధికం. 2023-24 ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో ప్రగతిపద్దు, నిర్వహణ పద్దు కింద రూ. 26 వేల కోట్లు సాగునీటిపారుదల, ఆయకట్టు శాఖకు నిధులు కేటాయించింది. 2021-22లో రూ.26,810 కోట్లు, 2022-23లో రూ.11,737 కోట్లు బడ్జెట్‌లో పెట్టారు. గత రెండేండ్లుగా ఈ నిధుల్లో అధికంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించడానికే ఇవ్వాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రతిపాదించిన అనంతరం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ ధ్రువీకరించారు. ‘సాగునీటి శాఖ ప్రాధాన్యత ఉంటుంది. అప్పులకు మిత్తి చెల్లించడానికే రూ. 16 వేల కోట్లు కావాలి.. మళ్లీ మా ప్రాథాన్యతలను పూర్తిచేయాలి కదా’ అని వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఇప్పుడు మిత్తి ఎక్కువ చెల్లించాల్సి రావచ్చని సాగునటి శాఖ అధికారులు చెబుతున్నారు. అది రూ. 16 వేల కోట్ల నుంచి రూ. 18 వేలకు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
మళ్లీ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తిరిగి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల జాబితాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల పథకం చేరింది. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల పరిస్థితి ఆశాజనంగా లేకపోవడంతో ఆ ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చేదాకా ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టే అవకాశాల్లేవని స్పష్టమవుతున్నది. ఇక కాళేశ్వరం, సీతారామ వంటి ప్రాజెక్టులను ముట్టుకుంటే భారీగా నిధులు ఖర్చుచేయాలి. ఇక ఇప్పట్లో అవి పూర్తయ్యే పరిస్థితులు లేకపోవడంతో తక్కువ వ్యయంతో తక్కువ వ్యవధిలో అధికంగా ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. రూ.28 వేల కోట్లలో దాదాపు రూ.14600 కోట్లను కాళేశ్వరం కార్పొరేషన్‌కు రుణాల కింద, మరో రూ.3 వేల కోట్లను తెలంగాణ నీటి అభివృద్ధి సంస్థ రుణాలకు పోనూ…. రూ.9 వేల కోట్ల దాకా ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించనున్నారు. ప్రాధాన్య జాబితాలో పాలమూరు కూడా ఉండనుంది.
7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు: ఉత్తమ్‌
2024-25 ఆర్థిక సంవ త్సరంలో 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ఈ దశలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌, కొడంగల్‌- నారాయణపేట వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. చిన్న కాళేశ్వరం, చనకా కొరాటా, మొడికుంటవాగు వంటి ప్రాజెక్టులను ప్రధానమంత్రి కృషి సించారు యోజన (పీఎంకేఎస్వీ) కింద కేంద్ర సహాయంతో చేపడతాం.
విచారణ చేయాలి
నీళ్లు, నిధులు, నియామకాల పేర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసింది. గత దశాబ్దకాలంగా నీటి వనరులపై పెట్టుబడి ఫలితం ఆశించిన మేర రాలేదు. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రాజెక్టులను పూర్తిగా పట్టించుకోలేదు. లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరంలో సైతం అవినీతి జరిగింది. నేరస్థులను శిక్షించాలి. పరిహారం రాబట్టాలి. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయాలి. ప్రాజెక్టులకు కాల్వలను నిర్మిస్తేనే ఫలితాలు వస్తాయి.
-సారంపల్లి మల్లారెడ్డి సాగునీటిరంగ నిపుణులు

బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రాధాన్య ప్రాజెక్టులు, కేటాయింపులు

ప్రాజెక్టు ఖర్చు (రూ.కోట్లల్లో మిగిలిన వ్యయం (రూ.కోట్లల్లో) వచ్చే ఆయకట్టు(ఎకరాల్లో)
పాలమూరు-రంగారెడ్డి 27,553.44 2050 2.80 లక్షలు
ప్రాణహిత-చేవెళ్ల 1806.41 9000.59 2 లక్షలు
ఇందిరమ్మ వరద కాలువ 9848.58 1971 2.02 లక్షల
దేవాదుల ఎత్తిపోతల 13812.28 3687.72 1.91 లక్షలు
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 5503.44 357.47 1.44 లక్షలు
జవహర్‌ నెట్టెంపాడు 2503.85 43.84 98000
ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ 8467 4467 1. 27 లక్షలు
రాజీవ్‌ బీమా 2829.25 8 45000
కొమరంభీం 781.09 101.22 22000
కోయిల్సాగర్‌ 659.51 64.82 12000
చిన్నకాళేశ్వరం 346.63 283.37 45000
చనకా కొరాటా 1042.02 980.93 50000
నారాయణపేట-కొడంగల్‌ 0 2950.50 1.0 లక్షలు
కేటాయింపులు(రూ.కోట్లల్లో) ఏడాది బడ్జెట్‌ వ్యయం రుణవ్యయం మొత్తం
2021-22 6,949 9,351 17,459 26,810
2022-23 9,587 6,539 5,198 11,737
(డిసెంబరు వరకే)
2023-24 ప్రగతిపద్దు, నిర్వహణ పద్దు కింద 26,446.98
2024-25 పగతిపద్దు, నిర్వహణ పద్దు కింద 28,024