చంద్రబాబు రాకకు సన్నాహాలు

– తెలంగాణ టీడీపీలో ఉత్సాహం
– 7న ఎన్టీఆర్‌ భవన్‌కు ఏపీ సీఎం
నవతెలంగాణ ప్రత్యేకప్రతినిధి-హైదరాబాద్‌
తెలుగుదేశం తెలంగాణ శాఖలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్నది. ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్‌లోని ఆపార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సందడి నెలకొంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్‌కు వస్తుండటంతో ఆయనకు ఘనస్వాగతం పలకాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ఈమేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. శుక్రవారం విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చంద్రబాబు రానున్నారు. అక్కడ ఆయనకు భారీ జనసమీకరణతో స్వాగతం పలకాలని ఆపార్టీ నాయకత్వం బక్కని నర్సింహులు, అర్వింద్‌ కుమార్‌గౌడ్‌, జ్యోత్స్న తదితర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. జనసమీకరణతోపాటు ఈనెల ఏడో తేదీన సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సైతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చంద్రబాబు క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆపార్టీ కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిందనే రాజకీయ వ్యాఖ్యానాలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆ పార్టీ జిల్లా యూనిట్లు ఉత్సాహం చూపుతున్నాయి. ఇందుకోసం అనుమతి ఇవ్వాలని అధినేతను అడిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ఏపీ ప్రభుత్వంలో పలు నామినెటెడ్‌ పోస్టులకు తెలంగాణ పార్టీ నేతలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా పోటీపడుతున్న పొలిట్‌బ్యూరో సభ్యులు అర్వింద్‌కుమార్‌కు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇస్తారని సమాచారం. అలాగే ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగే సమావేశంలో సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారని ఆపార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం త్వరలో ఉంటుందని అంటున్నారు. దీనికోసం మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు అర్వింద్‌కుమార్‌, జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్‌ జ్యోత్స్న తదితరులు అధ్యక్ష పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదిలావుండగా ఆరో తేదీన విభజన సమస్యలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్ది, చంద్రబాబు ప్రజాభవన్‌లో భేటీ కానున్న విషయం విదితమే.