
రబీ 2024-25( యాసంగి ) ధాన్యం సేకరణకు సంబంధించి సంబంధిత అధికారుల సన్నాహక సమావేశం రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. శనివారం తన ఛాంబర్ లో ధాన్యము సేకరణలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంబంధిత విభాగాల అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జిల్లా సహకార అధికారి , జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా రవాణా అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రానున్న యాసంగి సీజన్‌లో ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉన్నందున దానికి సంబంధించిన ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లాలో సుమారు 2,75,000 ఎకరాల వరిపంట సాగు చేసినందున సుమారుగా 7.00 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, కొనుగోలు కేంద్రాలకు 4,50,000 టన్నుల ధాన్యం రానున్నదని అంచనా వేశారు. అనంతరం జిల్లా రైస్ మిల్లర్ల తో సేకరణ సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మిల్లర్లు తమ వద్ద ఉన్న ప్రభుత్వ ధాన్యమునకు సంబంధించిన సీయంఆర్ బియ్యాన్ని వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత తెలియజేశారు. తద్వారా మిల్లర్ల వద్ద ఖాళీ స్థలం ఏర్పడుతుందని, రానున్న సీజన్‌ల ధాన్యం సేకరణ ప్రక్రియ సులభతరం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్క మిల్లరు తమకు రానున్న ధాన్యం కొరకు తగినంత గోదాము స్థలాలను గుర్తించి అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య పూర్తి సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగి రెడ్డి, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.