
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలంలో అంతర్ పాఠశాల క్రీడోత్సవాల నిర్వహణపై చర్చించేందుకు మండల విద్యాధికారి ఆంధ్రయ్య అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. 2024-25 విద్య సంవత్సరానికి గాను అంతర్ పాఠశాలలకు క్రీడోత్సవాలను కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సహకారంతో కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. క్రీడల కన్వీనర్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం వ్యవహరిస్తారని ఎంఈఓ ఆంధ్రయ్య తెలిపారు. మండల అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను సెప్టెంబర్ 26, 27, 28 తేదీలలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఐదు సంవత్సరాల విరామం అనంతరం మండల అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఎంఈఓ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, ప్రధాన కార్యదర్శి నూకల బుచ్చి మల్లయ్య, ఉపాధ్యక్షులు నిమ్మ రాజేంద్రప్రసాద్, గణేష్, ఎంఎన్ఓ గంగాధర్, మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.