– ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ-జైపూర్
మండల పరిధిలో గ్రామీణుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఇందారం, టేకుమట్ల, రామారావుపేట్ గ్రామ పంచాయతీలలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి గురువారం పర్యటించిన ఆయన గ్రామీణుల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో చేపడుతున్న పారిశుధ్య పనులు పరిశీలించారు. గ్రామ పంచాయతీల్లో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, స్థానిక ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్, ఎంపీఓ శ్రీపతి బాపు రావు, మిషన్ భగీరథ ఏఈ విద్యాసాగర్, పంచాయతీ రాజ్ ఏఈ రాజ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫయాజోద్దీన్, జిల్లా కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, తాజామాజీ సర్పంచులు గడ్డం మంజుల ప్రసాద్, నామాల సత్యవతి తిరుపతి పాల్గొన్నారు..
దోబీ ఘాట్ ఏర్పాటు చేయాలని వినతి
రామారావుపేట్ గ్రామ పంచాయతీకి సంబంధించి దోబీ ఘాట్ ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన రజక కుల సంఘం నాయకులు కోరారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్‌ను కలిసి దోబీ ఘాట్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఇందారం-రామారావుపేట్ మధ్యన గల పెద్ద చెరువులో బట్టలు ఉతికే పరిస్థితి లేదని తెలిపారు. సింగరేణి ఏరియా నుంచి చెరువులోకి వచ్చి చేరుతున్న మురికి నీటిలో బట్టలు ఉతుకరాదని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఫలితంగా మా ఉపాధికి భంగం కలుగుతుందని తెలిపారు. దోబీ ఘాట్ ఏర్పాటు చేస్తే తప్పా తమకు ఉపాధి దొరకదని రజకుల సంఘం నాయకులు తుంగపిండి వెంకటేశ్, తిరుపతి, సంతోష్, సత్తయ్య కోరారు.