– 2036 ఒలింపిక్స్‌పై భారత్ ఆసక్తి
– ఈ మేరకు ఐఓసీకి లేఖ రాసిన ఐఓఏ
న్యూఢిల్లీ : 2010 కామన్‌వెల్త్ క్రీడల తర్వాత భారత్ అతిపెద్ద క్రీడా సంగ్రామానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ గతంలో భారత ప్రధాని నరెంద్ర మోడితో సమావేశమైన సందర్భంగా.. ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసి) సమగ్ర నివేదిక సిద్ధం చేయగా.. ఆతిథ్య హక్కులు దక్కితే కొత్తగా ఏ క్రీడలను చేర్చాలనే అంశంపై సైతం రిపోర్టు తయారు చేసిందని సమాచారం. యోగా, కబడ్డీ, ఖోఖో, చెస్, స్క్వాష్, క్రికెట్‌లను ఒలింపిక్స్‌లో చేర్చాలనే ప్రణాళికలను సైతం రూపొందించారు. ఇందులో భాగంగా 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఒలింపిక్ కమిటీ (ఓఐఓ) అక్టోబర్ 1న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ‘లెటర్ ఆఫ్ ఇంటెట్’ (ఆసక్తి వ్యక్తీకరణ లేఖ)ను సైతం అందజేసినట్టు విశ్వసనీయ సమాచారం. 2036 సమ్మర్ ఒలింపిక్స్, 2036 పారాలింపిక్స్ ఆతిథ్యం అందించేందుకు ఆసక్తి వ్యక్తపరుస్తూ లేఖ రాసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఫ్యూటర్ హోస్ట్ కమిషన్ ఈ అంశంలో తదుపరి చర్యలు తీసుకోనుంది. వచ్చే ఏడాది ఐఓసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం 2036 ఒలింపిక్స్ ఆతిథ్య నగరం ఎంపిక ప్రక్రియ ఉండనుంది. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ సహా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జర్మనీ 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పోటీపడుతున్నాయి.