నవతెలంగాణ-భద్రాచలం రూరల్
ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్నందున గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులు, అలాగే గురుకులాల్లో పదవ తరగతి చదివే విద్యార్థినీ, విద్యార్థులకు రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్స్ ఏర్పాటు చేస్తూ పరీక్షలు బాగా రాసేలా సంబంధిత ఉపాధ్యా యులు, లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజు అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున, ఆయన ఆదేశానుసారం వివిధ గిరిజన గ్రామాలనుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలలో పోడు భూములకు పట్టాలు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, ట్రైకార్ రుణాలు, వ్యవసాయానికి సంబంధించి కరెంటు, మోటారు, బోరుబావుల కోసం, గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించుట కోసం, ఇలా తదితర సమస్యలపై గిరిజన దర్బార్లో దాదాపు 150కి పైగా అర్జీలు వచ్చాయని, వీటిని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి అర్హులైన ప్రతి గిరిజనులకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్‌ఓ సురేష్ బాబు, ఏడీ అగ్రికల్చర్ భాస్కర్ ,ఏపీవో పవర్ మునీర్ పాషా, డీటీఆర్‌ఓ ఎఫ్‌ఆర్ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈఈ నారాయణరావు, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ, వివిధ విభాగాలకు చెందిన ప్రమీల బారు, నరేందర్, వెంకటేశ్వర్లు, సుగుణ, నాగభూషణం, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాణిక్యం, ప్రసాద్, మణి కుమారి తదితరులు పాల్గొన్నారు.