– చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చార్మినార్ సర్కిల్ ప్రియాంక వర్గీస్
నవతెలంగాణ-కొడంగల్
అర్బన్ పార్క్, ఎకో టూరిజం పార్క్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చార్మినార్ సర్కిల్ ప్రియాంక వర్గీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం రిజర్వ్ ఫారెస్ట్, కొత్తూరు సెంట్రల్ నర్సరీ, అప్పాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బొంరాస్‌పేట్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం అర్బన్ పార్క్, ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉందన్నారు. అటవీ ప్రాంతంలో అర్బన్ పార్క్ అభివృద్ధితోపాటు పక్కనే ఉన్న బొంరాస్‌పేట్ చెరువులో వాటర్ స్పోర్ట్స్ ప్రతిపాదనలు కూడా అవసరమని అధికారులకు సూచించారు. కొత్తూరు సెంట్రల్ నర్సరీని సందర్శించి ఆ నర్సరీలో రాబోయే వర్షాకాలానికి చందనం మొక్కలను పెంచి రైతులకు అందే విధంగా చూడాలని ఆదేశించారు. కొత్తూరు ప్రజలకు ఉపయోగపడే మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నర్సరీ స్థాయిని మరింతగా పెంచాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని చెప్పారు. రంగురంగుల భోగం విలియా మొక్కలను నాటడం ద్వారా రోడ్డుకు ఇరువైపులా మరింత అందాన్ని చేకూర్చాలని హెచ్‌ఎండీఏ అధికారులకు సూచించారు. అనంతరం అప్పాయిపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో చేపట్టిన ప్లాంటేషన్‌ను సందర్శించారు. సరైన అటవీ మొక్కలను మంచి ఎత్తులో ఉన్న మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. అలాగే కొడంగల్‌లోని కాడ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, కాడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, ఎఫ్‌ఆర్‌వో సవిత, అటవీ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. కొడంగల్‌లో అటవీ శాఖ అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యామ్‌కుమార్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.