తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల స్థితిగతులను పరిశోధించడానికి బీసీ కమిషన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణుల తరఫున తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నాగరాజు , వేముల సుధాకర్ లు పాల్గొని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులకు సంబంధించిన 15 డిమాండ్స్ ని బీసీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అనంతరం ఈ సమస్యలపై స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ సమస్యలు పరిష్కరించే విధంగా వెంటనే నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ కి పాలక కమిటీ ఏర్పాటు, ఆత్మగౌరవ భవనం సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మిగతా డిమాండ్లు కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉపసంచాలకులు జి ఆశన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.