– భారత్‌పై వ్యాఖ్యలు పలువురి ఖండన
మాలె : కొత్తగా ఎన్నికైన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు పదవి నుండి వైదొలగాలని, ఆయన ప్రభుత్వం రాజీనామా చేయాలని మాల్దీవులకు చెందిన పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే ముయిజు రాజీనామా చేయాలంటూ తాజాగా పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన అజిమ్ అలీ డిమాండ్ చేశారు. మాల్దీవుల ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు తక్షణమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలంటూ ఆయన ప్రతిపక్ష నేతలను కోరారు. ప్రజాస్వామ్యవాదులుగా దేశ విదేశాంగ విధానం సుస్థిరతను పరిరక్షించడానికి తాము అంకితమయ్యామని, ఏ పొరుగు దేశాన్నీ కూడా ఏకాకిని చేయడానికి తాము వ్యతిరేకమని ఆజం అలీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తక్షణమే భారతీయులకు క్షమాపణలు చెబుతూ మాల్దీవుల ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహృం సోలీ మాట్లాడుతూ, మంత్రులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగ్గవన్నారు.