మణిపూర్‌ అంశంపై భేటీకి రాష్ట్రపతి ఓకే

– నేడు ప్రతిపక్ష నేతలతో సమావేశం
న్యూఢిల్లీ : మణిపూర్‌ హింసాకాండపై విపక్షాల ఆవేదనను ఆలకించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే అభ్యర్ధనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. మణిపూర్‌ అంశంపై చర్చించేందుకు బుధవారం 11.30 గంటలకు విపక్ష ఎంపీలతో సమావేశమయ్యేందుకు ముర్ము సమయం కేటాయించారు. గత రెండు నెలలుగా మణిపూర్‌ అట్టుడుకుతుండగా ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చించేందుకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు పార్లమెంట్‌లో పట్టుబడుతున్నాయి. మణిపూర్‌ పరిస్ధితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ వేదికగా ప్రకటన చేయాలని కూడా విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. కాషాయ సర్కార్‌ ఏలుబడిలో ఉన్న మణిపూర్‌లో హింస అదుపుతప్పడంతో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.