పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి

– ద్రౌపది ముర్ముకు జాతీయ ఎస్‌సీ కమిషన్‌ నివేదిక
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలిలో మహిళలపై టీఎంసీ గూండాలు వేధింపులకు పాల్పడుతున్న ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జాతీయ ఎస్‌సీ కమిషన్‌ (ఎన్‌సిఎస్‌సి) బృందం నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో రాప్ట్రపతి పాలన విధించాలని నివేదిక సిఫార్సు చేసినట్టు ఎన్‌సీఎస్‌సీ అధ్యక్షులు అరుణ్‌ హల్డర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. టీఎంసీ నాయకుడు షాజహాన్‌ షేక్‌, అతని మద్దతుదారులు తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భారీ సంఖ్యలో మహిళలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సందేశ్‌ఖలిని గురువారం ఎన్‌సీఎస్‌సీ బృందం సందర్శించింది. శుక్రవారం నివేదికను సమర్పించిన తరవాత మీడియాతో మాట్లాడుతూ అరుణ్‌ హల్డర్‌ ఆ ప్రాంతంలో జరుగుతున్న దారుణాలను క్లుప్తంగా వివరించారు. ఎస్‌సీ హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్టికల్‌ 338 ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేసినట్టు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని కమిషన్‌కు రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు అరుణ్‌ హల్డర్‌ చెప్పారు. అలాగే, సందేశ్‌ఖలిలో సందర్శించకుండా అడ్డుకునేందుకు టీఎంసీ ప్రభుత్వం ప్రయత్నించిందని, తమ పర్యటన కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. నేరస్థులతో టిఎంసి ప్రభుత్వం కుమ్మక్కయిందని విమర్శించారు. సందేశ్‌ఖలిలో జరిగిన హింస ఇతర ఎస్‌సి ప్రజలపై కూడా ప్రభావం చూపుతుందని హల్దర్‌ తెలిపారు. దేశంలో ఎస్‌సి జనాభా విషయంలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం రెండోస్థానంలో ఉన్న విషయాన్ని హల్దర్‌ గుర్తు చేశారు. ఈ హింసాకాండపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్‌ నోటీసు కూడా పంపిందని తెలిపారు.
కాగా, రేషన్‌ కుంభకోణం కేసు విచారణలో భాగంగా జనవరి 5న ఈడీ అధికారులు షాజహాన్‌ షేక్‌ నివాసంపై సోదాలు జరిపినప్పటి నుంచి అతను పరారీలో ఉన్న విషయం తెలిసిందే. షేక్‌ అనుచరుడు సిబ్హు హజ్రా కూడా పరారీలో ఉన్నాడు. పరారీలో ఉన్న షేక్‌ను వెంటనే అరెస్టు చేయాలని సందేశ్‌ఖలి మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.
కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌, బీజేపీ నాయకుల అడ్డగింత
సందేశ్‌ఖలిలో పర్యటించకుండా కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరిని మార్గమధ్యంలో పశ్చిమ బెంగాల్‌ పోలీసులు అడ్డుకున్నారు. రాంపూర్‌ గ్రామంలో శుక్రవారం అధిర్‌ రంజన్‌ను అడ్డుకోవడంతో ఆయన అక్కడే రోడ్డుపై ఆందోళనకు దిగారు. అలాగే మరోవైపు బీజేపీ నాయకులను కూడా అదే గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. సందేశ్‌ఖలి ఘటనపై నిజనిర్థారణ కమిటిని బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డా ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర మంత్రులు అన్నపూర్ణ దేవి, ప్రతిమా భౌమిక్‌, ఎంపీలు సునీతా దుగ్గల్‌, కవితా పటిదార్‌, సంగీతా యాదవ్‌, బ్రిజ్‌లాల్‌ ఉన్నారు. ఈ బృందం సందేశ్‌ఖలి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రాంపూర్‌ గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకుంది. బీజేపీ నాయకులు కొన్ని గంటలపాటు రోడ్డుపై ఆందోళనకు దిగారు. కొంతమంది బాధిత మహిళలతో బీజేపీ నాయకులు వీడియో కాల్‌లో మాట్లాడారు. తరువాత ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కోసం రాజ్‌భవన్‌కు వెళ్లారు.