– ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు ప్రయత్నం
– సీనియర్ జర్నలిస్టు లు గార్లపాటి కృష్ణారెడ్డి, చింతకింది గణేష్
– జర్నలిస్టుల ఐక్యతను కాపాడేలా కార్యక్రమాలు
– నూతన అధ్యక్ష కార్యదర్శులు ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
ప్రెస్ క్లబ్ అంటే జర్నలిస్టుల ఔన్నత్యాన్ని కాపాడుతూ బాధిత ప్రజలకు అండగా నిలవాలని సీనియర్ జర్నలిస్టులు గార్లపాటి కృష్ణారెడ్డి, చింతకింది గణేష్ అభిప్రాయపడ్డారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రధాన మీడియా, చిన్న పేపర్లు, డెస్క్ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులు అనే వ్యత్యాసం లేకుండా అందరికీ ప్రెస్ క్లబ్ అండగా నిలవాలనీ వారు సూచించారు. ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వంతో సంప్రదిస్తున్నారని వారు తెలిపారు. అనంతరం నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. తమ పట్ల విశ్వాసం ఉంచి నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి సహచర జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. పని చేసే మీడియా సంస్థ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికి సమన్యాయం అందిస్తామని, జిల్లా కేంద్రం లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ మీడియా అకాడమీ సహకారంతో జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తామని ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. బాధితులకు అండగా నిలుస్తూ ప్రెస్ క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడడంతోపాటు జర్నలిస్టుల ఐక్యత ను చాటే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.