– జీవో 16ను ఉపసంహరించుకోవాలి :గురుకుల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకుల ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని గురుకుల జేఏసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్ గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గురుకులాలకు కామన్ టైం టేబుల్ నిర్ధారిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 16ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 700 వరకు గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వసతుల లేమితో కొట్టు మిట్టాడుతున్నాయని తెలిపారు. ఏ ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయుడు నివసించే విధంగా క్వార్టర్స్‌ను నిర్మించలేదని పేర్కొన్నారు. జీవోను తీసుకొచ్చే ముందు ఏ ఒక్క సంఘంతో చర్చించకుండా కనీసం టీచర్ ఎమ్మెల్సీలతో కూడా చర్చించకుండా ఏకపక్షంగా విడుదల చేయటమేంటని ప్రశ్నించారు. వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.