– పుంజుకోని ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల డిమాండ్
– పేరుకుపోతున నిల్వలు
– ఆందోళనలో కంపెనీలు
న్యూఢిల్లీ: గ్రామీణ ఆదాయాల్లో ఒత్తిడి నెలకొనడంతో ఇప్పటికీ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల్లో డిమాండ్ కొరవడింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్చూమర్ గూడ్స్కు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా డిమాండ్ పునరుద్దరణ జరగలేదని బిజినెస్ స్టాండర్డ్ ఓ కథనంలో వెల్లడించింది. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ నిర్వహించిన ఎఫ్ఎంసిజి సమ్మిట్ అనంతరం ఈ వార్తను ప్రచురించింది. డెయిరీ, కాస్మోటిక్స్, పానియాలు, బేకరీ ఉత్పత్తులు, సబ్బులు, షాంపులు తదితర ఉత్పత్తులు ఎఫ్ఎంసిజి విభాగంలోకి వస్తాయి. డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఎఫ్ఎంసిజి అమ్మకాల్లో రికవరీకి అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. గ్రామీణ డిమాండ్ ఇప్పటికీ పట్టణ మార్కెట్లలో వెనుకబడి ఉందని అన్నారు. పండుగల సీజన్ ఉన్నప్పటికీ నగదు లభ్యత సమస్యలు గ్రామీణ ప్రాంతాలను వేధిస్తున్నాయని మల్హోత్రా పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి నుండి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గింది. ఈ ప్రభావాన్ని దేశంలోని అతిపెద్ద ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ ఎత్తి చూపింది. రబీ పంట గ్రామీణ డిమాండ్ లో పెరుగుదలను ప్రతిబింబిస్తుందని అదానీ విల్మార్కు చెందిన అంగ్షు మల్లిక్ పేర్కొన్నారు. గ్రామీణ మార్కెట్లు రికవరీ సంకేతాలను మాత్రం చూపిస్తున్నాయని మార్కెట్ పరిశోధన సంస్థ ఎన్ఐక్యూ నివేదిక పేర్కొంది. సెప్టెంబరు త్రైమాసికంలో వినియోగం మునుపటి సంవత్సర ంతో పోలిస్తే మెరుగ్గా ఉందని తెలిపింది. డిమాండ్ లేమీతో ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి ఎఫ్ఎంసిజి కంపెనీల వద్ద, పంపిణీదారుల వద్ద సరుకుల నిల్వలు పెరిగాయని సమాచారం. దేశంలో చోటు చేసుకుం టున్న అధిక ధరలకు తోడు విద్యా, వైద్యం వ్యయాలు పెరిగిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోతోంది. మరోవైపు ఆదాయాలు పెరగక పోవడంతో అనేక రంగాల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపైన ప్రతికూల ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.