పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి

నవతెలంగాణ-వీణవంక
బీఆర్ఎస్ ఎంపీలు త్వరలో నడిచే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం ఒత్తిడి పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పర్లపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పర్లపల్లి తిరుపతి కోరారు. ఈ మేరకు వారి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఆ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన మలి దశ ఉద్యమంతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ కు అండగా ఉంటున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినా ఎలాంటి లాభం లేదని వాపోయారు. అలాగే ఈ అంశంపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని కానీ తీసుకెళ్లలేదని, ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు ఒత్తిడి పెంచెలా చూడాలని కౌశిక్ రెడ్డిని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్ రెడ్డి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రుద్రారపు రామచందర్, జిల్లా సీనియర్ నాయకులు రేణిగుంట్ల సాగర్, నియోజకవర్గ ఇన్చార్జ్ వసంత్, హుజరాబాద్ మండల అధ్యక్షుడు దేవునూరి రవీందర్, నాయకులు సంపత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.