– ఎమ్మెల్యే కూనంనేనికి ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సీపీఐని కోరింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును గురువారం హైదరాబాద్‌లో మఖ్దూంభవన్‌లో ఈయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈ వెంకన్న కలిసి వినతిపత్రం సమర్పించారు. 2017, ఏప్రిల్ ఒకటి, 2021, ఏప్రిల్ ఒకటిన ఈ రెండు వేతన సవరణలు వెంటనే జరగాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయినట్టుగా గెజిట్ పబ్లిష్ అయినందున విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈనెల నుంచే ఆర్టీసీ కార్మికుల వేతనాలు ప్రభుత్వ ట్రెజరీల ద్వారా చెల్లించాలని తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత ఇవ్వాలనీ, 2019 నుంచి అందరికీ యూనిఫారాలను అందించాలని పేర్కొన్నారు. సుమారు ఎనిమిది డీఏలకు సంబంధించిన బకాయిలు కార్మికులకు చెల్లించలేదనీ, వాటిని వెంటనే ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. పెంచిన పనిభారాన్ని తగ్గించాలనీ, అన్ని కేటగిరీల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీకి యాజమాన్యం ఇవ్వాల్సిన రూ.1,200 కోట్లను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఎస్బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌లకు బకాయి పడిన నిధులు, పీఎఫ్‌నకు సంబంధించిన బకాయిలనూ వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి తొమ్మిదిలోపు దిగేలా డ్యూటీలు వేయాలని కోరారు. ఈ సమస్యలపై కూనంనేని వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
కూనంనేనికి డి రాజా అభినందనలు
కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును గురువారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్యపద్మ, ఎం బాలనరసింహ తదితరులు పాల్గొన్నారు.