వేషాల పోశాలు దేశాల పాలు

Pretense is the milk of nationsచేసే పని ఏదో చక్కగా చేసుకుంటా పోతే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ నాలుగు రోజులకో పని మార్చుకుంటూ పోతే జీవితం ఒక ప్రయోగం అయితది. ఇటువంటి వాళ్లను ఇన్ని వేషాలు ఎందుకురా సక్కగా ఒక్క పని చేసుకుంటే చాలదా అంటారు. వీళ్ళనే ‘వేషాల పోషాలు దేశాల పాలు’ అని వెక్కిరింపుగా సంబోధిస్తారు. పొట్టకూటి కోసం ఒక్క పని కాకుండా రకరకాల పనులు చేస్తూ దేశాలు తిరిగినట్టు. దేశాలు అంటే ఇక్కడ విదేశాలని కాదు మరొక ప్రాంతాన్నే జానపదులు దేశం అంటారు. వీళ్లకు ఎవరైనా మంచి చెబితే కూడా మారరు, గుణమే ఇలా ఉంటుంది. అందుకే ‘వేపకాయకు తీపి ఉంటదా, వేసంగి చలువ ఉంటదా’ అంటారు. అందుకే ‘తిరిగే కాలు నిలువది’ అని కూడా అంటారు. ఇలాంటి వాళ్ల పట్ల అందరూ జాగ్రత్తగానే ఉంటారు. ‘వేలు పెట్ట సంధిస్తే కాలు పెట్ట చూస్తారు’ అంటే కొంచెం ఛాన్స్‌ ఇస్తే మొత్తం చొచ్చుకొని వస్తారు అన్నట్టు. ‘ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి’ అనేది జీవన సూత్రం. ‘వేలు వంకర పెడితే గాని వెన్న రాదు’ అనేది ఒక సామెత. కుండలో చల్ల చేసినప్పుడు గిలక్కొట్టినంక వేలును వంచితేనే వెన్న వస్తుంది. అందుకే వంకర చూపులు వంకర మాటలు వంకర పనులు కొన్నిసార్లు అవసరమవుతాయి. ఇవన్నీ పల్లె జీవితంలో పుట్టిన సామెతలు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479