ముంబయి : చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్ పేర్కొనడంతో స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మంగళవారం బిఎస్‌ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31 శాతం, 2.11 శాతం చొప్పున నష్టపోయాయి. మార్చిలో ఇప్పటి వరకు స్మాల్ క్యాప్ సూచీ ఏకంగా 5 శాతం ప్రతికూలతను ఎదుర్కొంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎస్‌ఎమ్‌ఈ)ల విభాగంలో ధరల్లో అవకతవకలు సంకేతాలు కనిపిస్తున్నాయనీ బచ్ సోమవారం హెచ్చరించారు. నష్టభయం అధికంగా ఉండే ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టే ముందు మదుపర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. దీంతో ఆ రంగం సూచీలపై ఒత్తిడి నెలకొంది. కాగా బిఎస్‌ఇ సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 73,668కి చేరింది. ఇంట్రాడేలో 73,342 – 74,4004 మధ్య కదలాడింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 22,334 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు అధికంగా లాభపడగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఐటిసి, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరసలో ఉన్నాయి.