ప్రాథమిక వైద్యం మరింత బలోపేతం కావాల్సిందే

– నియామకాలపై దష్టి సారించాల్సిందే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరగకుండా ఆ సమాజం ప్రగతిని సాధించలేరనేది సత్యం. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తం గా ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు సైతం మహమ్మారి దెబ్బకు వణికి పోవడం, ప్రజారోగ్య వ్యవస్థ బలంగా ఉన్న దేశాలు ధీటుగా ఎదుర్కొ నడం కండ్ల ముందు సాక్షాత్కరించిన దశ్యం. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అదే క్రమంలో రాష్ట్రం ప్రభుత్వ వైద్యవ్యవస్థను బలోపేతం చేసేందుకు పూనుకున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు, కార్య క్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. అదే సమయంలో ప్రాధాన్యతలను గుర్తించాల్సిన విషయంపై పలు సూచనలు వస్తున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే ప్రజలకు మరింత మేలు జరిగే అవకాశముంది.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల నుంచి రాబోయే మూడు, నాలుగేండ్లలో ప్రతి ఏడాది 8 వేల మందికిపైగా ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని బయటికొచ్చే వారి సేవలను ప్రజలకు ఉపయోగించుకునేలా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే ప్రయివేటు లేదా విదేశాలకు ఉపాది కోసం వెళ్లే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పటికే రాష్ట్రంలో మాతా, శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది. వ్యాక్సినేషన్‌, ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాల్లోనూ ముందు వరసలో నిలిచింది. అదే సమ యంలో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల వ్యవస్థను తీసుకొచ్చి వైద్యరంగాన్ని మూ డంచెల నుంచి ఐదెంచల వ్యవస్థగా మార్చి క్రమబద్దీకరించే ప్రయత్నం చేసింది. వీటి ద్వారా ప్రజలకు చిన్న, చిన్న రోగాలు వచ్చిన సందర్భాల్లో మందులిచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివార ణ, చికిత్స, పునరావాసం, అవసానదశలో ఉపశమనం (పాలియేటివ్‌ కేర్‌) లాంటివి ప్రాథమిక ఆరోగ్య దశలోనే అందేలా చూడాలని సూచించింది. ఆ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దితే బాగుంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరోగ్య అవగాహన, దాని పట్ల ప్రేరణ కలిగిస్తూ, ప్రవర్తనలు, అలవాట్ల వల్ల వచ్చే రోగాల నుంచి బయటపడేందుకు ప్రాథ మిక స్థాయిలోనే నిర్మాణం ఉండాల్సిన అవసరముంది. అక్కడి ప్రాథమిక వైద్యమందించే డాక్టర్లకు ఈ మేరకు తగిన శిక్షణ ఇస్తే బాగుంటుంది. ఈ దిశగా కుటుంబంలోని అన్ని వయస్సుల వారి ఆరోగ్యాన్ని చూడగలిగిన ఫ్యామిలీ మెడిసిన్‌ చదివిన వైద్యుల సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఫ్యామిలీ మెడిసిన్‌ (కుటుంబ వైద్యం) చదివిన వారి సేవలను ఉపయోగించుకున్న రాష్ట్రాలు, దేశాల్లో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ బలోపేతంగా ఉన్న అనుభవాలున్నాయి. పాఠశాల స్థాయిలోనే ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కూడా మెరుగైన ఫలితాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలి : డాక్టర్‌ శ్రీనివాస్‌
ఆరోగ్యరంగ బడ్జెట్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని అకాడమీ ఆఫ్‌ ఫ్యామిలీ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగడం శుభపరిణాం. మాతా, శిశువుల ఆరో గ్యం, మరణాలను తగ్గించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ లాంటి వాటిలో మం చి ప్రగతి కనిపిస్తున్నది. నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌సీడీ) క్లినిక్‌లు నామమాత్రంగా మారాయి. వాటిలో ఉన్న వైద్యులకు బిహేవియర్‌ ఛేంజ్‌ కౌన్సిలింగ్‌ పద్ధతిపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరముంది. ఎన్‌ఎంసీ గుర్తిం చిన ఫ్యామిలీ మెడిసిన్‌ రెండు సంవత్సరాల కోర్సును జిల్లా ఆస్పత్రులు, 50 బెడ్లు, 100 బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ప్రారంభించాలి. ఫ్యామిలీ మెడిసిన్‌ చేసిన డాక్టర్ల సేవలు ప్రాథమిక ఆరోగ్య సేవల్లో గణనీయంగా ఉపయోగపడతాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
ప్రభుత్వ ఆస్పత్రి అంటే గతంలో గర్భిణులు వచ్చేవారు కాదు.. ప్రస్తుతం సర్కారు దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు కేసీఆర్‌ కిట్ల్‌ పంపిణీ చేయడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 65 శాతం ప్రసవాల సంఖ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య 60 శాతం ఉంది. ప్రభుత్వం ఆస్పత్రుల్లో సిజేరియన్స్‌ను నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిది