ప్రధాని మోడీ మౌనం వీడాలి

— లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం
– సభను వాయిదా వేసి, కేంద్రం తప్పించుకుంది : బీఆర్‌ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత నామా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణాలు, హింసాకాండపై ప్రధాని మోడీ వెంటనే మౌనం వీడి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ లోక్‌ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం లోక్‌ సభలో మణిపూర్‌ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ఆయన చర్చించాలని పార్టీ ఎంపీలతో కలసి పట్టుబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసార మాధ్యమాల్లో ఆ ఘటన వైరల్‌ అయిందని తెలిపారు. ఇది అమానవీయం అన్నారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్లే మణిపూర్‌ రావణకాష్టంలా మండుతోందనీ, మృత్యుఘోష కొనసాగుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయనీ, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని తెలిపారు. వేలాది మంది ఇళ్లను వదిలి, సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని వివరించారు. మహిళల గౌరవాన్ని కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ వాయిదాపై మండిపాటు
మణిపూర్‌ అంశాన్ని చర్చించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ఇచ్చినా చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం సభను కావాలనే శుక్రవారానికి వాయిదా వేసి, తప్పించుకుందని నామా విమర్శించారు.