శ్రీచైతన్య విద్యార్థికి ప్రధాని ప్రశంసలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్నేషనల్‌ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌-2024లో ప్రతిభ కనబర్చిన శ్రీచైతన్య టెక్నో స్కూల్‌ విద్యార్థి ఎంవి ఆదిత్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు అందుకున్నారు. ఆ మేరకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ, శ్రీచైతన్య స్కూల్స్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తూ ఎందరో విద్యార్థులను విశ్వవిజేతలుగా తీర్చిదిద్దుతూ మరో మైలురాయిని అధిగమించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మంది ప్రతిభ గల విద్యార్థులు పోటీపడిన ఇంటర్నేషనల్‌ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఆరుగురు సభ్యుల విద్యార్థి బృందంలో తమ స్కూల్‌ విద్యార్థి బావదాస్‌ పూణేకు చెందిన ఎంవి ఆదిత్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. చారిత్రక విజయాన్ని సాధించిన ఆదిత్యను ఎక్స్‌ వేదికగా ప్రధాని మోడీ అభినందించారని పేర్కొన్నారు. ఈ అసాధారణమైన విజయం దేశానికి గర్వకారణమని తెలిపారు.