ప్రధాని పసుపు బోర్డు ప్రకటన రైతులను మళ్లీ మోసం చేసేందుకే..

నవతెలంగాణ- ఆర్మూర్  
ప్రధాని  నరేంద్ర మోడీ పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మాత్రమే అని,మరో సారి రైతులను మోసం చేసే కుట్రకు తెరలేపారని బిఆర్ఎస్ రాష్ట్ర నేత, ప్రముఖ రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు  సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలనీ అన్నారు. 1986 లో పార్లమెంట్ ద్వారా చట్టమైన స్పైస్ బోర్డులో భాగంగా ఉన్న పసుపుకు బోర్డు ఏర్పాటు చేయాలంటే ప్రత్యేక చట్టం చేయాలని ప్రధాని మోడీకి తెల్వదా అని ప్రశ్నించారు. బీజేపీ కి చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు కోసం బిల్లు పెట్టలేదని నిలదీశారు. పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు. ఓట్ల కోసం మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల  కోసం రైతులను ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారనీ, ఎన్నికలప్పుడే పసుపు రైతులు గుర్తుకు వస్తారా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ ప్రకటన నమ్మశక్యం కాదని పసుపు రైతులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రైతులు ఆలోచన చేయాలని ఆయన కోరారు.