– కరపత్రాల వివరాలను మూడు రోజుల్లోగా తెలపాలి
నవతెలంగాణ నల్లగొండ కలెక్టరేట్ : ఎన్నికల సందర్భంగా ప్రచార నిమిత్తం ప్రచురించే కరపత్రాలు, గోడ పత్రికల విషయంలో ప్రచురణకర్తలు, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని నియమ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచురించే కరపత్రాలు, గోడ పత్రికల ముద్రణకు సంబంధించి ఎన్నికల నిబంధనల పాటించాల్సి ఉంటుందని తెలిపారు.ఎన్నికల పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్, ప్రింటర్ పేరు, ముద్రించిన ప్రతులు, ఫోన్ నెంబర్ తో సహా ప్రచురించాలని, అంతేకాక ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రచురణ కర్త ద్వారా ఒక డిక్లరేషన్ తీసుకోవాలని, ఆ డిక్లరేషన్ లో ప్రచురణకర్త వారికి తెలిసినట్టుగా మరో ఇద్దరు అటెస్ట్ చేసి ఉండాలని పేర్కొన్నారు. ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలకు సంబంధించి వివరాలను ప్రచురించిన 3 రోజుల్లో జిల్లా ఎన్నికల అధికారికి అనేక్జర్ ఏ,బి తోపాటు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. డిక్లరేషన్లో పేర్కొన్న ప్రతులకు మించి ఎక్కువ కాపీలు ముద్రించడం, పంపిణీ చేయడం వంటివి చేస్తే ప్రజా ప్రతినిధ్య చట్టం 1951, సెక్షన్ 127 కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.