– ఈడీ, సీబీఐలతో రాజకీయ కక్ష సాధింపులపై నోరు మెదపని ప్రధాని
– రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభను వాడుకున్న మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానం ఇవ్వాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రాజకీయ ప్రసంగమే చేశారు. ఈ ఐదేండ్లలో తానేం చేశానో చెప్పడం కంటే, ప్రతిపక్షాలపై విమర్శలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఊకదంపుడు విమర్శలతో ప్రసంగమంతా సాగింది. ఈడీ, సీబీఐలతో రాజకీయ కక్ష సాధింపులపై నోరు మెదపని ప్రధాని మోడీ, ప్రతిపక్షాలపై నోరు పారేసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపైనా చౌకబారు విమర్శలతో రెచ్చిపోయారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోడీ సోమవారం సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీకి దూరంగా జరుగుతున్నాయనీ, పోటీ చేయాలనే సంకల్పమే లోపించిందని అన్నారు. చాలామంది లోక్‌సభకు బదులు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారని తాను విన్నాననీ, పరిస్థితిని అంచనా వేయడంతో వారు తమ మార్గాలను వెతుకుతున్నారని వ్యాఖ్యానించారు.
దేశంలో నాలుగు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలు చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని, ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతిపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని చెప్పారు. మైనారిటీలంటూ ఎంతకాలం విభజన రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. తోటి ప్రతిపక్షాలను కాంగ్రెస్ ఎదగనీయలేదని, కాంగ్రెస్ తీరు దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని అన్నారు.
ప్రాంతీయ జనాభా ఆధారంగా మైనారిటీ నిర్వచనం మారవచ్చని నొక్కి చెప్పిన ఆయన.. మత్స్యకారులు, జంతువుల కాపరులు, రైతులు, మహిళలు మైనారిటీలు కారా? అని ప్రశ్నించారు. విభజించు పాలించుని పక్కనపెట్టేసి.. అందరినీ కలుపుకుపోయే పాలనపై దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలను కోరారు. విభజనల గురించి ఎంతకాలం ఆలోచిస్తారు? సమాజాన్ని విడదీస్తూ ఇంకెంతకాలం ఉంటారు? అని ప్రశ్నించారు.
ఎన్డీయే మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అబ్ కీ బార్ మోడీ సర్కార్ అని ఖర్గే కూడా అంటున్నారని నవ్వుతూ చెప్పారు. బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయనీ, ఎన్డీయేకు 400కు పైనే సీట్లు వస్తాయన్నారు. ప్రతిపక్షాలు ఈసారి కూడా ప్రతిపక్షంలోనే ఉంటారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండటం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని విమర్శించారు.