విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలి

– బీఆర్‌ఎస్‌ పాలనలో పదేండ్లపాటు నిర్లక్ష్యం
– ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలి
– బుర్రా వెంకటేశానికి ప్రొఫెసర్లు కోదండరామ్‌, హరగోపాల్‌, పీఎల్‌వీ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని ప్రొఫెసర్లు కోదండరామ్‌, హరగోపాల్‌, పీఎల్‌ విశ్వేశ్వరరావు సూచించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పదేండ్లపాటు విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యారంగం, విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని చెప్పారు. ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి అన్ని ఖాళీలనూ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో వారు సమావేశమయ్యారు. విద్యారంగ సమస్యలపై దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రస్తావించామని చెప్పారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డును ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఆ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉందన్నారు. వీలైనంత త్వరగా ఉన్నత విద్యామండలికి కొత్త పాలకమండలిని నియమించాలనీ, వీసీల నియామకాలపైనా ప్రభుత్వానికి పలు సూచనలు చేశామని అన్నారు. ఈ సమావేశం అనంతరం ప్రొఫెసర్లు మాట్లాడుతూ విద్యావ్యవస్థలో గల సమస్యలు, విశ్వవిద్యాలయాల పరిస్థితిపై ప్రభుత్వానికి తమ ఆలోచనలను వివరించామన్నారు. త్వరలోనే విద్యారంగంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై మరోసారి సమావేశమవుతామనీ, అప్పడు ప్రభుత్వమే పూర్తి వివరాలను వెల్లడిస్తుందని కోదండరామ్‌ చెప్పారు.
మెగా డీఎస్సీకి చర్యలు చేపట్టండి : బుర్రా వెంకటేశం
పాఠశాల విద్యాశాఖ అధికారులతో బుర్రా వెంకటేశం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మెగా డీఎస్సీ నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. కోర్టు కేసులపైనా ఆయన ఆరా తీశారు. అవి త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలనీ, ఎప్పటికప్పుడు దృష్టిసారించాలని సూచించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, సమగ్రశిక్ష అదనపు డైరెక్టర్‌ గాజర్ల రమేష్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ కృష్ణారావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.