
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించాలని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ, వయో వృద్ధుల శాఖ రాష్ట్ర కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ లతో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అలాగే కొత్త పుస్తకాలు వచ్చినందున ఆదిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిదంగా పోషక ఆహారం లోపంపై జిల్లాలవారిగా నివేదికలు అందించాలని తెలిపారు. దత్తత సంబంధించి కొత్త మార్గదర్శకాల ప్రకారం గృహ సందర్శన నివేదికలు సిద్ధం చేసి వెబ్ సైట్ లో పొందుపర్చాలని అన్నారు. అదేవిదంగా పిల్లలు, వృద్ధులు, వికలాంగుల గృహాలు లేని చోట స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలు పంపాలని అలాగే ఉన్న చోట గృహాలకు మరమ్మత్తులు చేపట్టి అందుబాటులోకి తేవాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి జిల్లాలో అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వయో వృద్ధుల కేసులు త్వరగా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాలని, ట్రాన్సజెండర్లకు ఐడి కార్డులు అందచేయాలని పేర్కొన్నారు. వికలాంగులకు సదరం క్యాంపులు చేపట్టి అర్హులకు సర్టిఫికెట్ లు అందచేయాలని సూచించారు.తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యాబోధనకు ప్రాధాన్యత అలాగే పిల్లలకు నాణ్యమైన పోషక ఆహారం అందాలని అన్నారు. ప్రతి కేంద్రంలో త్రాగునీరుతో పాటు మరుగుదొడ్లు తప్పక వినియోగంలో ఉండాలని అలాగే దత్తత కేసులు, వికలాంగుల రిజర్వేషన్ అమలు, భేటి పడావో.. బేటీ బచావో కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది విధులు బాధ్యతాయుతంగా నిబద్ధతతో చేపట్టాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, డి డబ్ల్యు ఓ జ్యోతి పద్మ, సి.డి.పి.ఓ లు తదితరులు పాల్గొన్నారు.