
-13 మందికి గాయాలు
– ఒకరికి విరిగిపడిన చేయి
– డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగం.. అజాగ్రత్తగా బస్సు నడపడం వల్ల బస్సు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలయ్యాయి.వివరాలలోకి వెళితే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మర్రి గూడ బైపాస్ హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన (పి వై 01-సీఎస్-3407) నెంబర్ గల ప్రయివేటు బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టి బోల్తా పడిపోయింది. దీంతో 13 మంది గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపిన వివరాల ప్రకారం ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుండి చెన్నై వెళ్తుంది. అర్ధరాత్రి సుమారు 11:30 గంటల సమయంలో నల్లగొండ సమీపానికి రాగానే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో సుమారు 35 నుండి 40 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ఒకరికి కుడి చేయి విరిగిపోయింది. మిగిలిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. నల్లగొండ లోని మర్రిగూడ బైపాస్ వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు ఫల్టి కొట్టింది.ఏపీ లోని కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన బాచిరెడ్డి అమర్నాథ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ జిల్లా కు చెందిన బస్సు డ్రైవర్ పుండ్ర మనోహర్ పై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సైదా బాబు చెప్పారు.