ప్రయివేటు కోచింగ్‌ సెంటర్లు.. డమ్మీ పాఠశాలలు

Private coaching centers Dummy schools– ప్రోత్సహిస్తున్న ఎన్సీఈఆర్టీ
– తగ్గించిన సిలబస్‌ను పునరుద్ధరించని వైనం
– పోటీ పరీక్షలకు సన్నద్ధం కాలేకపోతున్న విద్యార్థులు
న్యూఢిల్లీ : విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్సీఈఆర్టీ తన చర్యల ద్వారా ప్రయివేటు కోచింగును, డమ్మీ పాఠశాలలను ప్రోత్సహిస్తోంది. కోచింగ్‌ దందాకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఎన్సీఈఆర్టీ ఈ చర్యకు పూనుకోవడం విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు…సిలబస్‌ తగ్గింపుపై కూడా విద్యావేత్తల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్య పుస్తకాలను సీబీఎస్‌ఈ, పదిహేను రాష్ట్రాలకు చెందిన పాఠశాలల బోర్డులు ఉపయోగిస్తున్నాయి. అయితే కోవిడ్‌ కష్టకాలంలో 9 నుండి 12వ తరగతి వరకూ పాఠ్య పుస్తకాల సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ తగ్గించింది. మూడు సంవత్సరాలు గడిచినా దానిని ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీనిపై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు.
సిలబస్‌ తగ్గించడంతో విద్యార్థులు కోచింగ్‌ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎందుకంటే నీట్‌, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు హాజరు కావడానికి ఈ సిలబస్‌ సరిపోవడం లేదు. ఎన్సీఈఆర్టీ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రయివేటు కోచింగులకు వ్యతిరేకంగా 2020 నాటి జాతీయ విద్యా విధానం తీసుకున్న వైఖరికి భిన్నంగా ఉన్నాయి. 2020లో మొత్తం సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ 40% మేర తగ్గించింది. కోవిడ్‌ కారణంగా పాఠశాల విద్యకు ఆటంకం ఏర్పడడంతో విద్యార్థులపై భారం పడుతోందని, అందుకే సిలబస్‌ను తగ్గించామని అప్పుడు ఎన్సీఈఆర్టీ వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ మామూలుగానే నడుస్తున్నప్పటికీ పాత సిలబస్‌ను మాత్రం ఎన్సీఈఆర్టీ పునరుద్ధరించలేదు.
వ్యూహాత్మక అడుగులు
సిలబస్‌ తగ్గింపులో కూడా బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించిందన్న విమర్శలు వచ్చాయి. కాషాయ పార్టీ సిద్ధాంతాలకు దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను కుదించారు. మొఘలుల పాలన, అంతర్జాతీయ ఇస్లాం చరిత్ర, కుల వివక్ష చరిత్ర, మహాత్మా గాంధీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌పై విధించిన నిషేధం వంటి పాఠ్యాంశాలన్నీ మటుమాయమయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 6 తరగతుల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టాలని ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది. ఇప్పటికే 1, 2 తరగతులకు నూతన పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు. మిగిలిన తరగతులకు మాత్రం హేతుబద్ధీకరించిన (తగ్గించిన) సిలబస్సే కొనసాగుతుందని తన అనుబంధ పాఠశాలలకు ఎన్సీఈఆర్టీ తెలిపింది.
వేరే దారే లేక…
సిలబస్‌ను తగ్గించడంతో ప్రయివేటు కోచింగ్‌ కేంద్రాలను ఆశ్రయించడం మినహా విద్యార్థులకు మరో మార్గం లేకుండా పోయిందని న్యూఢిల్లీలోని ఐటీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుధా ఆచార్య చెప్పారు. తగ్గించిన పాఠశాల సిలబస్‌కు, కాలేజీల ప్రవేశ పరీక్షల సిలబస్‌కు మధ్య అంతరం ఎక్కువగా ఉందని ఆమె తెలిపారు. పదో తరగతి తర్వాత విద్యార్థులు ‘డమ్మీ’ పాఠశాలలకు బదిలీ కోరుకుంటున్నారని అన్నారు. డమ్మీ పాఠశాలలు 10, 12 తరగతుల విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వారు ప్రయివేటు కోచింగ్‌ కేంద్రాలకు వెళుతున్నప్పటికీ తమ సంస్థల్లో హాజరు వేస్తున్నాయి. ఈ కోచింగ్‌ కేంద్రాల్లో కొన్ని డమ్మీ పాఠశాలల తరగతి గదుల్లోనే నడుస్తుంటాయి. అవి విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తుంటాయి. ప్రయివేటు కోచింగ్‌ ఖరీదైనదే అయినప్పటికీ ఆ కేంద్రాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య రానురానూ పెరుగుతోందని ఓ ఉపాధ్యాయుడు చెప్పారు. కాగా 30 డమ్మీ పాఠశాలల అనుబంధ గుర్తింపును సీబీఎస్‌ఈ కొద్ది రోజుల క్రితమే ఉపసంహరించుకుంది.