డెంగ్యూ తగ్గినా…’ప్రయివేటు’ భయం

Even if dengue is reduced... 'Private' fear– అలాంటి వారిపై చర్యలు తీసుకోండి :జిల్లా వైద్యాధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు డెంగ్యూ చికిత్స పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయి. ప్లేట్‌ లేట్స్‌ ఎక్కించాలంటూ భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చిందని ఆ శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఆరోగ్యం క్షీణించాక చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్‌ చేసి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నట్టు తెలిసిందన్నారు. వాస్తవాలు గుర్తించి, ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మంగళవారం ఆయన సీజనల్‌ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్‌ వరకు డెంగ్యూ కేసులు 7,988 నమోదైతే ఈ ఏడాది ఆ సంఖ్య 5,263కు తగ్గిందని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి. మిషన్‌ భగీరథ వంటి పథకాలతో సీజనల్‌ వ్యాధులు గణనీయంగా తగ్గాయని చెప్పారు.
వాతావరణ మార్పుల కారణంగా గత వారం, 10 రోజుల్లో ఫీవర్‌ కేసులు స్వల్పంగా పెరిగినట్టు మంత్రి తెలిపారు. ఎవరికైనా జ్వరలక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయంచుకోవాలనీ, అవ సరమైన మందులను అన్ని ఆస్పత్రుల్లో అందు బాటులో ఉంచినట్టు చెప్పారు. డెంగ్యూ, మలేరియా కేసుల్లో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి స్వల్ప లక్షణాలున్నా చేర్చుకుని చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైన చోట జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయా లని సూచించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో పంచాయతీ, మున్సిపల్‌ శాఖల, స్థానిక సంస్థల సమన్వయంతో దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.